సోనియా గాంధీ తన ఆత్మకథలో దేశంలో విధించిన ఎమర్జెన్సీ నాటి(1975–77) చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం పట్ల సంతృప్తిగా లేరని, కానీ పరిస్థితుల ఒత్తిడి వల్లే ఆమె ఆ అడుగు వేయాల్సి వచ్చిందని సోనియా తెలిపారు. ఆ కాలంలో సంజయ్ గాంధీ ఒక ‘తొందరపాటు మనిషిగా’ వ్యవహరించారని పేర్కొన్నారు. ఎలాంటి రాజ్యాంగబద్ధమైన హోదా లేకపోయినా, ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడంలో సంజయ్ చాలా కీలకమైన పాత్ర పోషించారని స్పష్టం చేశారు.
సంజయ్ ప్రవేశపెట్టిన ఐదు సూత్రాల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కుటుంబ నియంత్రణ (నసబంది), ఢిల్లీలో మురికివాడల తొలగింపు వంటి కార్యక్రమాలు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సోనియా రాశారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ రాజకీయంగా ఒంటరిగా, తీవ్ర ఒత్తిడికి గురయ్యారని గుర్తుచేసుకున్నారు. సంజయ్ దూకుడు స్వభావం వల్ల కుటుంబంలోనూ కొన్ని మనస్పర్థలు వచ్చాయని, భర్త రాజీవ్ గాంధీ తన తల్లిని తరచూ ఓదారుస్తూ సరైన సలహాలు ఇచ్చేవారని తెలిపారు.
ఎమర్జెన్సీ వల్ల దేశం తీవ్రమైన దిగ్బంధనంలో చిక్కుకుందని, పత్రికలపై కూడా ఆంక్షలు విధించారని ఆమె పేర్కొన్నారు. 1976 క్రిస్మస్ తర్వాత అల్లకల్లోల పరిస్థితుల నుంచి బయటపడాలని ఆమె భావించారు. ఎన్నికలు నిర్వహించడం మంచిదని రాజీవ్ కూడా సూచించారు. కానీ ఎమర్జెన్సీని ఇప్పుడే ఎత్తివేయకూడదని సంజయ్ గట్టిగా పట్టుబట్టారని చెప్పారు. అయినప్పటికీ, 1977 జనవరి 18న రాజకీయ ఖైదీలను విడుదల చేస్తున్నట్లు, నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఇందిరా గాంధీ సంచలన ప్రకటన చేశారని సోనియా తన పుస్తకంలో వివరించారు.
ఆ రోజు ఇందిరా గాంధీ ఏడ్చారు..
1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ అనంతర పరిణామాలను గుర్తుచేసుకుంటూ సోనియా గాంధీ తన ఆత్మకథలో పలు భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. అప్పట్లో పంజాబ్‌లో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నాయకత్వంలో హింసాత్మక వేర్పాటువాద ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. స్వర్ణ దేవాలయాన్ని ఒక సాయుధ కోటలా మార్చి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఈ కుట్రను అడ్డుకోవడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ 'బ్లూస్టార్' ఆపరేషన్‌కు ఆదేశించాల్సి వచ్చింది.
ఈ సైనిక చర్యలో పవిత్ర దేవాలయానికి నష్టం వాటిల్లింది. ఇరువైపులా భారీ ప్రాణనష్టం సంభవించింది. సిక్కుల పవిత్రతకు భంగం వాటిల్లడం ఇందిరా గాంధీని తీవ్రంగా కలచివేసింది. ఆపరేషన్ ముగిసిన వారం తర్వాత నిఘా వర్గాలు తెచ్చి ఇచ్చిన ఒక ఫిల్మ్‌ను ఇందిరా గాంధీ చూశారు. ఆ దృశ్యాల్లో నేలమీద పడి ఉన్న మృతదేహాలు, భింద్రన్‌వాలే డెడ్ బాడీ, భారీ ఆయుధాలు కనిపించాయి. ఆ చిత్రాలను చూస్తున్న సమయంలో ఇందిరా గాంధీ ముఖం కన్నీళ్లతో తడిసిపోయిందని సోనియా రాశారు.
