- కుప్పకూలిన ఎన్‌విడియా షేర్లు!
- ఒక్కరోజులో 4.27 శాతం డౌన్
- కుబేరుల జాబితాలో పదో స్థానానికి పతనం
న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అత్యంత విలువైన సెమీకండక్టర్ కంపెనీ ఎన్‌విడియా షేర్లు సోమవారం భారీగా నష్టపోయాయి. కంపెనీ సీఈఓ జెన్‌సన్ హువాంగ్‌కు చైనా మహిళతో ఉన్న సంబంధాలపై అమెరికా నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేయడం, ఈ వ్యవహారంపై కంపెనీ బోర్డు విచారణకు ఆదేశించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. ఎన్‌విడియా షేరు సోమవారం ట్రేడింగ్‌లో 4.27 శాతం పతనమై 178.67 డాలర్ల వద్ద ముగిసింది. ఒక్కో షేరు ధర 7.97 డాలర్లు తగ్గింది. ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ఒక దశలో నష్టం 7 శాతానికి చేరింది.
ఈ పరిణామం హువాంగ్ వ్యక్తిగత సంపదపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన తొలి 30 నిమిషాల్లోనే ఆయన సంపద సుమారు 7.4 బిలియన్ డాలర్లు తగ్గింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.69 వేల కోట్లకు సమానం. అంతకుముందు 162.2 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద 154.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. షేర్లు ప్రారంభంలో 7 శాతానికి పైగా క్షీణించడంతో సీఈఓ సంపద ఒక దశలో 10.3 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.
దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయారు. ఈ వివాదం నేపథ్యంలో ఎన్‌విడియా మార్కెట్ విలువ సుమారు 4.5 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి ఒత్తిడికి గురైంది. నవంబర్ 9న ఎన్‌విడియా షేరు 178.67 డాలర్ల వద్ద ముగిసింది. 52 వారాల గరిష్ఠ ధర 243.37 డాలర్లతో పోలిస్తే 26.6 శాతం తగ్గింది. గత వారం రోజుల్లో 14 శాతం పడింది. దీంతో షేరు బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశించింది. కంపెనీ నాయకత్వం, పాలనా వ్యవస్థపై ఇన్వెస్టర్లలో నెలకొన్న సందేహాలు షేర్ల పతనానికి కారణమయ్యాయి.
ఆలిస్‌తో ఆగమాగం
సింగపూర్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ మెగాస్పీడ్‌తో సంబంధాలున్న ఆలిస్ హువాంగ్ అనే మహిళతో జెన్‌సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె చైనా నిఘా సంస్థల తరఫున సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. ఈ ఆరోపణలు నిజమైతే కంపెనీ రహస్య సమాచారం, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎన్‌విడియా బోర్డు స్వతంత్ర డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బయటి న్యాయ నిపుణుల సహకారంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. కంపెనీ రహస్య సమాచారం లేదా జాతీయ భద్రతకు సంబంధించిన ప్రయోజనాలకు నష్టం జరిగినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌విడియా స్పష్టం చేసింది. తన వ్యక్తిగత వ్యవహారంపై హువాంగ్ ఉద్యోగులకు ఈ–మెయిల్ పంపారు. భార్యకు నమ్మకద్రోహం చేసిన విషయాన్ని అంగీకరిస్తూ, దాని వల్ల కలిగిన వ్యక్తిగత బాధకు క్షమాపణలు తెలిపారు. గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ నిరాధారమైనవని స్పష్టం చేసింది.
