కోట్లాది మంది ఉద్యోగులు, పింఛనుదారులకు ఉత్కంఠ రేకెత్తించే వార్త. EPFO త్వరలో నిర్వహించబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంపై అందరి చూపు నిలిచింది. నవంబర్ 19, 2026 న ఢిల్లీలోని ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలో 240వ సీబీటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం ఇస్తున్న కనీస నెలవారీ పింఛను రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచే అవకాశం ఉందనే వార్త చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఈ సమావేశం గుజరాత్‌లోని గిర్‌లో జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఢిల్లీకి మార్చారు. నవంబర్ 4, 2026 నాటి లేఖ ప్రకారం.. రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సుబ్రతా భౌమిక్ ఈ భేటీ వివరాలను సీబీటీ సభ్యులకు తెలిపారు. ఈ సమావేశంలో కనీస ఈపీఎస్ పెన్షన్ పెంపు అంశమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కనీస పింఛనును రూ.3వేలకి పెంచే అంశంపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే కేంద్రం నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం లభించే వరకు పింఛనుదారులు ఈ రూ.3వేల వార్తను కేవలం ప్రచారంగానే భావించాలని నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్ 2014 నుంచి కనీస నెలవారీ పింఛను రూ.వెయ్యి వద్దే నిలిచిపోవడం.. మరోపక్క విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల నేపథ్యంలో కొద్ది మొత్తంతో జీవనం సాధ్యం కాదని, కనీస పింఛనును రూ.7వేల 500కి పెంచాలని వివిధ ఉద్యోగ, పింఛనుదారుల సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి.
ALSO READ : లోన్స్ సకాలంలో చెల్లిస్తున్నా.. మహిళా వ్యాపారవేత్తలకు అప్పులు పుట్టట్లే!
ఈపీఎస్ ఆర్గనైజ్డ్ రంగంలోని ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ నిర్వహించే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్. యజమాని చెల్లించే పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్‌కు వెళ్తుంది. ప్రస్తుతం కనీస పింఛను రూ.వెయ్యిగా ఉండగా.. నవంబర్ 19న జరిగే సీబీటీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి దీనిపై మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది.
