రాజీవ్‌ను రాజకీయాల్లోకి వద్దన్న సోనియా.. రాహుల్‌ను ఎందుకు ఆపలేదు..? అసలు కారణం ఇదే

రాజీవ్‌ను రాజకీయాల్లోకి వద్దన్న సోనియా.. రాహుల్‌ను ఎందుకు ఆపలేదు..? అసలు కారణం ఇదే

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులురాలు సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకం ఎట్టకేలకు విడుదలైంది. దేశ రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లో ఎంతో ఆసక్తిరేపిన ఈ పుస్తకంలో తన బాల్యం, విద్య, రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత విషయాలను ఆమె వెల్లడించారు. ఇక, దశాబ్ధాల పాటు దేశ రాజకీయాలను శాసించిన గాంధీ ఫ్యామిలీలో భాగమైన సోనియా ఇండియాకు వచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పుస్తకంలో వివరించారు. అత్త ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యలతో పాటు ఆ తర్వాత జరిగిన ముఖ్యమైన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆమె ఆ అనుభవాలను పుస్తకంలో పంచుకున్నారు. 

ఇందిరా గాంధీ హత్య తర్వాత తన భర్త రాజీవ్ గాంధీని రాజకీయాల్లో్కి వద్దని, ప్రధాని పదవి చేపట్టొద్దని వారించారు. ప్రధాని పదవి చేపడితే ఇందిరా గాంధీ మాదిరిగానే రాజీవ్ ప్రాణాలకు కూడా ప్రమాదమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టారు. సోనియా గాంధీ అనుమానించినట్లుగానే రాజీవ్ కూడా తన తల్లి ఇందిరా గాంధీ లాగా దారుణ హత్య గురయ్యారు. అయితే, ఇందిరా హత్య తర్వాత రాజీవ్‎ను రాజకీయాల్లోకి వద్దని వారించిన సోనియా.. తన కుమారుడు రాహుల్ గాంధీని మాత్రం రాజకీయాల్లోకి వెళ్లకుండా అడ్డుకోలేదు. ఇందిరా హత్య తర్వాత భయంతో భర్తను రాజకీయాల్లోకి వెళ్లొద్దని సోనియా.. కొడుకును మాత్రం ఎందుకు అడ్డుకోలేదని చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. 

రాహుల్‌కు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై చాలా ఆసక్తి ఉండేదని.. గాంధీ ఫ్యామిలీకి కంచుకోటైనా అమేథీతో అతనికి చిరకాల సంబంధం ఉందని సోనియా పేర్కొన్నారు. గ్రామీణ జీవితంలోని కఠిన వాస్తవాలను తెలియజేయడానికి విద్యార్థి దశ నుంచే రాహుల్‎ను తన తండ్రి రాజీవ్ చాలాసార్లు అమేథీకి తీసుకువెళ్లేవారని చెప్పారు. విదేశాల్లో చదువుకుని, ఉద్యోగం చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాహుల్ స్వయంగా ప్రజాప్రతినిధిగా మారి ప్రజలకు సేవ చేయాలని బలంగా నిశ్చయించుకున్నారని పేర్కొన్నారు. 

తనతో చర్చించాకే రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం, తండ్రి ఆశయాల పట్ల ఉన్న నిబద్ధతను చూసి రాజకీయాల్లోకి రావాలన్న రాహుల్ నిర్ణయాన్ని గౌరవించి అడ్డుకోలేదని సోనియా వెల్లడించారు. తండ్రి మరణాన్ని రాహుల్ ముందే ఊహించి.. ఆ విషయమై తండ్రితో వాదించినప్పటికీ.. తన తండ్రి ఆశయాలు, విలువలు, ఎంతటి ముప్పు ఉన్నా దేశం కోసం ఆయన సాగించిన పోరాటం పట్ల రాహుల్‌కు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‎లో క్రియాశీలక పాత్ర చేపట్టాలని పార్టీ నుంచి కూడా రాహుల్‎పై ఒత్తిడి ఉందని తెలిపారు. 

రాజకీయాలపై తన ఆసక్తి, పార్టీ కోరిక మేరకు 2004లో రాహుల్ కాంగ్రెస్ కంచుకోటైనా ఆమేథీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారని గుర్తు చేశారు. ఎంపీగా గెలిచాక తన తండ్రి రాజీవ్ చేసినట్లే గ్రామీణ అమేథీలోకి వ్యాపారాలు, పరిశ్రమలను తీసుకువస్తూ తన కొత్త బాధ్యతను రాహుల్ ఉత్సాహంగా చేపట్టారని ఆమె రాశారు. ప్రియాంక అమేథీలో స్వయం సహాయక బృందాలను ప్రారంభించి సమర్థవంతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకుందన్నారు. రాహుల్ ప్రమేయంతో అమేథీ స్వయం సహాయక బృందం ఉత్తర భారతదేశంలోనే అతిపెద్దదిగా మారిందని పేర్కొన్నారు. ఆమేథీలో రాహుల్ ఒక కంటి ఆసుపత్రిని కూడా నిర్మించారని చెప్పారు.