బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఐదురోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 663 కోట్లకు పై వసూళ్లు రాబట్టింది. గ్రాండ్ విజువల్స్, భారీ బడ్జెట్, నటీనటుల ఎంపికతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేఖ్ ఖన్నా నిప్పులు చెరిగారు.
బీఆర్ చోప్రా ' మహాభారత్ ' లో భీష్మ పితామహుడిగా కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకున్న ముకేశ్ ఖన్నా.. 'రామాయణ'లో సాయి పల్లవి పోషించిన సీతమ్మ పాత్రను యుద్ధవీరురాలిగా చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా ఈ చిత్రం దర్శకనిర్మాతలు సిగ్గుపడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణాన్ని తాను చదివానని, అందులో సీతమ్మ ఎక్కడా యుద్ధంలో పాల్గొన్నట్లు లేదని స్పష్టం చేశారు.
ఝాన్సీ లక్ష్మీబాయిలా, నేటి యాక్షన్ హీరోయిన్లలా సీతమ్మను కత్తులు పట్టుకుని రాక్షసులతో పోరాడే పాత్రలో చూపించడం ఏమిటని ముకేశ్ ఖన్నా ప్రశ్నించారు. దూషణుడితో జరిగిన యుద్ధంలోనూ రాముడే రాక్షసులను సంహరించాడని, సీతమ్మ, లక్ష్మణుడు యుద్ధరంగంలో లేరని గుర్తుచేశారు. మరి సీతమ్మ అంతటి యోధురాలైతే రావణుడు అపహరించే సమయంలో ఎందుకు ఎదిరించలేకపోయిందని నిలదీశారు.
నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సన్నివేశం 'అద్భుత రామాయణం' ఆధారంగా రూపొందించామని చెప్పడంపైనా ఖన్నా మండిపడ్డారు. అయితే అద్భుత రామాయణంలో సీతమ్మ మహాకాళి రూపంలో సహస్ర రావణుడిని సంహరించే ఘట్టం కూడా ఉంది. ఇక రావణుడికి రాముడికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ను తిరిగి రాబట్టుకోవడమే లక్ష్యమా? కథకు న్యాయం చేయడం ముఖ్యం కాదా? అంటూ ప్రశ్నించారు.
'ఆదిపురుష్' ఎదుర్కొన్న విమర్శలను గుర్తుచేస్తూ మరోసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ముకేశ్ ఖన్నా హెచ్చరించారు. అయితే నవంబర్ 5న విడుదలైన ఈ సినిమాను ఖన్నా ఇప్పటివరకు థియేటర్లో చూడలేదు. ప్రమోషన్లు, ప్రేక్షకుల స్పందన ఆధారంగానే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. రూ.1,200 టికెట్ పెట్టి సినిమా చూడబోనని కూడా తేల్చిచెప్పారు. అనుపమ్ ఖేర్ ఇచ్చిన పాజిటివ్ రివ్యూను సైతం ఆయన విమర్శించారు. మరి ఈ విమర్శలపై దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా ఎలా స్పందిస్తారో చూడాలి..
