దేశ హెల్త్ కేర్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టుతోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య భద్రతా పథకమైన ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో AI, ఆధునిక సాంకేతికతను జోడించి సేవలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం సిద్ధమైంది. నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్ బర్న్వాల్ స్పష్టం చేస్తూ.. ఆరోగ్య రంగానికి వెచ్చించే ప్రతి రూపాయి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ఉపయోగపడాలని, టెక్నాలజీ, డేటా, ఏఐ ద్వారా నిర్ణయాలు మరింత వేగంగా, కచ్చితంగా అమలవుతాయని పేర్కొన్నారు.
టెక్నాలజీ పురోగతిలో భాగంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల సెటిల్మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. 'ఆటో-అజ్యుడికేషన్' ద్వారా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సమయం, నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే నేషనల్ యాంటీ ఫ్రాడ్ యూనిట్ ద్వారా వైద్య రంగంలో జరిగే మోసాలను అరికట్టడం, పారదర్శకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనివల్ల అనర్హులకు నిధులు చేరకుండా అసలైన పేదలకు సకాలంలో వైద్య సాయం అందుతుంది.
►ALSO READ | నవంబర్ 19న ఈపీఎఫ్ఓ కీలక సమావేశం: కనీస పెన్షన్ రూ.3వేలు చేస్తారా?
ఈ ఏఐ ప్రయాణంలో అత్యంత విప్లవాత్మకమైన అడుగు 'ఏఐ-ఎనేబుల్డ్ వాయిస్ స్కైబ్'. డాక్టర్, రోగి మధ్య జరిగే సంభాషణను ఆటోమేటిక్‌గా వివిధ భారతీయ భాషల్లో డిజిటల్ క్లినికల్ రికార్డులుగా మార్చే సాంకేతికతను ఎన్హెచ్ఏ ప్రదర్శించింది. డాక్టర్లు వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాత నేరుగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌తో లింక్ చేస్తారు. దీనివల్ల వైద్యులపై రికార్డుల భారం తగ్గి, ఆసుపత్రులు పూర్తిగా డిజిటల్ రికార్డుల వైపు అడుగులు వేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్తో ఆసుపత్రుల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనుసంధానం ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు మరింత వేగంగా క్లియర్ అవుతాయి.
ఇక భారతీయ ఆరోగ్య రంగం అవసరాలకు తగినట్టుగా 'BODH' అనే ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఏఐ మోడళ్ల పనితీరును అంచనా వేయవచ్చు. కేవలం ఫైలింగ్, ఫైనాన్సింగ్ మీదే కాకుండా.. అసలైన ఆరోగ్య ఫలితాలపై దృష్టిసారించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ టెక్ విప్లవం ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం మరింత సులభంగా, వేగంగా చేరువ కానుంది.
