న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆత్మకథలో తన జీవితంలోని అత్యంత విషాదకరమైన, గుండెల్ని పిండేసే ఒక వ్యక్తిగత విషయాన్ని వెల్లడించారు. రాహుల్ గాంధీ కంటే ముందే 1969 జనవరిలో తొలి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపిన సోనియా ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదని హృదయవిదారకమైన జ్ఞాపకాలను ఈ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. పుట్టిన 24 గంటల్లోనే తన తొలి బిడ్డను కోల్పోయిన తీరని లోటును ప్రపంచానికి చెప్పారు.
1968 సెప్టెంబర్‌లో తాను గర్భవతి అనే విషయం తెలిసినప్పుడు భర్త రాజీవ్‌తో పాటు అత్త ఇందిరా గాంధీ కూడా ఎంతో సంతోషపడ్డారని సోనియా తెలిపారు. ప్రసవ సమయానికి రెండు నెలల ముందే మగబిడ్డకు జన్మనిచ్చానని.. బాబును ఇంక్యుబేటర్‌లో ఉంచినప్పుడు అతని మొదటి ఏడుపును విన్నానని గుర్తు చేసుకున్నారు. రాజీవ్ నన్ను ఆ బాబును చూడటానికి తీసుకువెళ్లారని.. ఒత్తైన నల్లటి జుట్టు, పొడవైన సన్నని వేళ్లతో ఆ చిన్నారి చాలా ముద్దుగా ఉన్నాడని పేర్కొన్నారు.
నేను, రాజీవ్ బాబుతో వెంటనే ప్రేమలో పడ్డామని రాసుకొచ్చారు. ఇందిరా గాంధీ కూడా విషయం తెలుకుని చాలా సంతోష పడ్డారని.. కానీ ఆ సంతోషం తమ కుటుంబంలో ఎక్కువ నిలవలేదన్నారు. పుట్టిన 24 గంటల్లోనే బాబు చనిపోయాడని పుస్తకంలో వెల్లడించారు. బాబు మరణ వార్త వినగానే రాజీవ్, తాను ఒకరినొకరు పట్టుకుని విలపించామని గుర్తు చేశారు.
ఆ సమయంలో బయట ఉన్న ఇందిరా గాంధీ తన పర్యటనను రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారని తెలిపారు. బాబు అంత్యక్రియల విషయంలో కూడా పెద్ద చర్చ జరిగిందని చెప్పారు. మతపరమైన సంప్రదాయ ప్రకారం బాబు మృతదేహాన్ని నదిలో వదిలేయాలని చెప్పగా దానిని తాను తీవ్రంగా వ్యతిరేకించానని సోనియా చెప్పారు.
►ALSO READ | రాజీవ్‌ను రాజకీయాల్లోకి వద్దన్న సోనియా.. రాహుల్‌ను ఎందుకు ఆపలేదు..? అసలు కారణం ఇదే
గతంలో ఓఖ్లా బ్యారేజీ వద్ద కుక్కలు ఒక శవాన్ని లాగడం చూసిన ఘటన గుర్తుకు వచ్చే తన బిడ్డ మృతదేహాన్ని నదిలో వదిలేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించానని వివరించారు. చివరకు రాజీవ్ గాంధీ, అతని సోదరుడు సంజయ్ గాంధీ కలిసి ఆ పసికందు మృతదేహాన్ని వారి తండ్రికి చెందిన మెహ్రౌలీ ఫామ్‌హౌస్‌లో పూడ్చిపెట్టారని చెప్పారు. ఆ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ప్రతిసారీ బాబు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశంలో ఒక పువ్వు ఉంచి నిశ్శబ్దంగా అంజలి ఘటించేవారమని వెల్లడించారు.
