యూపీ ఎమ్మెల్యే సాయం.. నిలిచిన షాద్ నగర్ బాలుడి ప్రాణం

యూపీ ఎమ్మెల్యే సాయం.. నిలిచిన షాద్ నగర్ బాలుడి ప్రాణం
  • రూ.35 లక్షల ఖర్చయ్యే 
  • కిడ్నీ మార్పిడి చేయించిన మధోగఢ్​ ఎమ్మెల్యే మూల్ చంద్  

షాద్ నగర్, వెలుగు: పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటొచ్చారు.. పానీపూరి బండి నడుపుకుంటూ జీవిస్తున్న ఆ దంపతులు కుమారుడి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని తెలిసి తల్లడిల్లారు. కిడ్నీ మార్పిడికి రూ.35 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారికి దిక్కుతోచలేదు. ఆ కుటుంబ దయనీయ స్థితి సోషల్​మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. విషయం ఉత్తరప్రదేశ్ ప్రజాప్రతినిధుల దృష్టికి చేరడంతో అక్కడి ఎమ్మెల్యే స్పందించి బాలుడికి ఆపరేషన్​చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్​కు చెందిన రవీంద్ర కుమార్, సుమన్ దేవి దంపతులు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగూరుకు వలస వచ్చారు. 

ఇక్కడ పానీపూరి బండి నడుపుకుంటూ పదేళ్ల కుమారుడు ఆశిక్ ను పోషించుకుంటున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో పిడుగులాంటి వార్త.. ఆశిక్​రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. కిడ్నీ మార్పిడి చేయాలని, రూ.35 లక్షలు ఖర్చవుతుందని డాక్డర్లు చెప్పారు. పానీపూరి బండి నడుపుకునే తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. 

వారి కష్టం సోషల్​మీడియా ద్వారా గత మార్చిన 6న వెలుగులోకి వచ్చింది. దీనికి ఉత్తరప్రదేశ్​లోని మధోగఢ్​ఎమ్మెల్యే మూల్ చంద్ నిరంజన్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఉత్తరప్రదేశ్​కు పిలిపించి, ప్రైవేట్​హాస్పిటల్​లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్​చేయించారు. ప్రాణాపాయం నుంచి కోలుకున్న ఆశిక్ తిరిగి చేగూరుకు చేరుకుని, ప్రస్తుతం సంతోషంగా బడిబాట పట్టాడు. బిడ్డను కాపాడుకున్న ఆ తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు, సాయపడిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.