దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర రోజురోజుకూ బలపడుతోంది. లోన్స్ తీసుకోవడంలో, వాటిని సక్రమంగా తిరిగి చెల్లించడంలో మహిళలు ముందున్నారు. వారిలో డిఫాల్ట్ రేట్లు అంటే అప్పులు ఎగ్గొడుతున్న వారి సంఖ్య కూడా మొత్తం సగటు కంటే చాలా తక్కువగా ఉందట. అయినప్పటికీ మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార విస్తరణ కోసం పెద్ద మెుత్తంలో లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ పొందడంలో మాత్రం ఇప్పటికీ పెద్ద సవాళ్లే ఎదురవుతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళలకు లోన్స్ మంజూరు చేయడంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చూపుతున్న వివక్ష, సాంకేతిక అడ్డంకులు వారి గ్రోత్‌కి అడ్డంకులుగా మారుతున్నాయి.
నీతి ఆయోగ్ - ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం.. దేశంలోని మొత్తం సిస్టమ్ క్రెడిట్లో మహిళల వాటా 26 శాతంగా ఉంది. 2017 నుంచి వారి బిజినెస్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 7.5 రెట్లు వృద్ధి చెందింది. 2024లో అప్పులు తీసుకున్న మహిళల రీపేమెంట్ రికార్డు అద్భుతంగా ఉంది. మొత్తం సగటుతో పోలిస్తే 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం బకాయి పడిన వారు కేవలం 0.7 శాతంగా మాత్రమే. ఇంత అద్భుతమైన క్రెడిట్ హిస్టరీ ఉన్నప్పటికీ.. కేవలం నాలుగో వంతు మంది మహిళా పారిశ్రామికవేత్తలు మాత్రమే తమ వ్యాపారాల పేరిట బ్యాంకుల నుంచి అప్పు తీసుకోగలుగుతున్నారు. చాలామంది పర్సనల్ లోన్లు, మైక్రోఫైనాన్స్, ముద్ర పథకాలపైనే ఆధారపడుతున్నారు తప్ప.. పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించేందుకు అవసరమైన ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సదుపాయాలను పొందలేకపోతున్నారు.
ఈ అసమానత ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 2026 నాటికి కేవలం 4 శాతం మహిళా వ్యాపార సంస్థలు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కలిగి ఉండగా.. మొత్తం వ్యాపారాలలో ఇది 40 శాతంగా ఉంది. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ అండర్‌రైటింగ్ పద్ధతులే. ఆస్తులు ఎక్కువగా పురుషుల పేరిట రిజిస్టర్ అయి ఉండటం, మహిళల వద్ద తగిన డాక్యుమెంట్లు లేకపోవడం వంటివి లోన్స్ రాకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా.. చాలా చిన్న వ్యాపారాల లావాదేవీలు మగ కుటుంబ సభ్యుల ఫోన్లు లేదా ఉమ్మడి ఖాతాల ద్వారా జరగడం వల్ల అసలైన టర్నోవర్ గుర్తించడం కష్టమవుతోంది. మార్చి 2025లో డిజిటల్ క్రెడిట్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ వచ్చినా.. డిజిటల్ విభజన కారణంగా మహిళలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదు. GSMA డేటా ప్రకారం 75% మంది మహిళల వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నప్పటికీ.. కేవలం 37% మంది మాత్రమే మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నారు.
కేవలం లోన్స్ ఇవ్వడమే కాకుండా.. ఆ నిధులను మహిళలే స్వయంగా నిర్వహించేలా సాధికారత కల్పించాలి. ప్రాంతీయ భాషల్లో డిజిటల్ లెండింగ్ యాప్స్ అందుబాటులోకి తేవడం, ప్రాపర్టీ డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా అప్పు మంజూరు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. అప్పుల రికవరీతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార నిర్ణయాలలో పూర్తి స్వేచ్ఛ లభించినప్పుడే అసలైన ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
