- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. ఆరోగ్యశ్రీకి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటన అబద్ధమన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్ఎంవో రూమ్లో అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించగా, డాక్టర్లు సంతకాలు పెట్టి హాస్పిటల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటర్నిటీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వార్డులు, ఫార్మసీ విభాగాలను సందర్శించి రోగుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం డాక్టర్లు, ఆస్పత్రి ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన విభాగాల్లో స్పెషలిస్టులు అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్లు, పీజీ వైద్యులపైనే ఆస్పత్రి బాధ్యతలు వదిలేశారని మండిపడ్డారు.
ఆస్పత్రిలో 318 మంది డాక్టర్లు ఉండగా, 600 పడకలకు కేవలం 301 మంది ఇన్పేషెంట్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను తమ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా రూ.2,500 కోట్ల చొప్పున మొత్తం రూ.19,500 కోట్లు చెల్లించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో రూ.7,500 కోట్ల బకాయిలకు కేవలం రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. అనంతరం చిన్నకోడూరులో విద్యార్థి విభాగం గ్రామ కమిటీ కార్యవర్గాన్ని సన్మానించారు.
