హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడాకుల వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ శ్రేణులకు సూచించాయి. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ, వైసీపీలు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశాయి. పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారాలపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఐటీడీపీ పేర్కొంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై పోస్టులు పెట్టొద్దని, విమర్శలు చేయొద్దని, అనవసర చర్చలకు దూరంగా ఉండాలని చెప్పింది.
సోషల్ మీడియాలో పార్టీకి చెందినవారు చేసే వ్యక్తిగత వ్యాఖ్యలకు ఐటీడీపీ బాధ్యత వహించదని పేర్కొంది. పార్టీ విధానాలను కాదని, అనుచితంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు, వైసీపీ కూడా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని తమ పార్టీ శ్రేణులకు స్పష్టం చేసింది. పవన్ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయొద్దని, పోస్టులు పెట్టొద్దని, ఇతరులు పెట్టిన పోస్టులకు స్పందించొద్దని, కామెంట్లు చేయొద్దని చెప్పింది. పార్టీ శ్రేణులు ఈ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించింది.
