ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ విడాకుల ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నో కామెంట్ అంటున్నారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని.. భార్యతో విడాకులు తీసుకోవటం పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయం అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ‘పవన్ కల్యాణ్ విడాకుల అంశంపై వైసీపీ ఇదే వైఖరితో ఉంది.. వ్యక్తిగత విషయాలపై స్పందించం’ అని అంబటి స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడను. https://t.co/2NyUfjsLpR
— Ambati Rambabu (@AmbatiRambabu) November 10, 2026
జనసేన వాళ్లు వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు జగన్ పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంటూ విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయాల్లో మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని జనసేన, టీడీపీ వాళ్లే ఆలోచించుకోవాలని.. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.
పవన్ కల్యాణ్ విడాకుల విషయంలో నో కామెంట్ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అంబటి ఇలా చెప్పుకొచ్చారు. అంబటి రాంబాబు మాత్రమే కాదు వైసీపీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ మీడియాలో, సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ విడాకుల అంశంపై ఎలాంటి వ్యాఖ్యానాలు, పోస్టులు చేయొద్దని వైసీపీ అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
తెలుగు దేశం పార్టీ కూడా తమ పార్టీ నేతలకు, క్యాడర్‌కు ఈ తరహా సూచనే చేసింది. ఏపీ రాజకీయాల్లో నాయకుల వ్యక్తిగత జీవితాలు రాజకీయ వివాదాలుగా మారిన ఘటనలు చాలానే ఉన్నాయి. వైసీపీ పార్టీ అధినేత జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య విభేదాలను టార్గెట్ చేస్తూ జనసేన, టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శలు చేశారు.
చెల్లి షర్మిలను, కన్న తల్లి విజయమ్మను దూరం పెట్టి వైసీపీ అధినేత జగన్ కుటుంబ విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ప్రత్యర్థి పార్టీలు విమర్శల వర్షం కురిపించాయి. వైసీపీ కూడా పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, రేణూ దేశాయ్ మాట్లాడిన విషయాలను ప్రస్తావించి జనసేనను టార్గెట్ చేశాయి. ఇలాంటి రాజకీయం నడిచిన ఏపీలో.. వ్యక్తిగత అంశాలపై స్పందించవద్దని టీడీపీ, వైసీపీ అధిష్టానాల నుంచి కేడర్‌కు, నేతలకు ఆదేశాలు రావడం ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.
