ఖలిస్థానీ వేర్పాటువాది గుర్వంత్ సింగ్ పన్నున్ దాఖలు చేసిన సివిల్ లా సూట్‌కు సంబంధించి అమెరికా కోర్టు నుంచి కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, RAW మాజీ చీఫ్ సమంత్ గోయల్ తదితరులపై న్యాయపరమైన నోటీసులు అందించేందుకు అమెరికా కోర్టు పన్నున్‌కు అధికారికంగా అనుమతిచ్చింది. 2023లో న్యూయార్క్‌లో పన్నున్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ కోర్టు ద్వారా లీగల్ పేపర్లను అందించవచ్చని అమెరికా న్యాయస్థానం స్పష్టం చేసింది.
నవంబర్ 30 డెడ్‌లైన్..
న్యూయార్క్ కోర్టు నవంబర్ 9న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పన్నున్ దాఖలు చేసిన సివిల్ లా సూట్‌కు సంబంధించి లీగల్ డాక్యుమెంట్లను అందించే ప్రక్రియను నవంబర్ 30, 2026 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. భారతీయ కోర్టుల ద్వారా ఈ నోటీసులను సర్వ్ చేయడానికి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది కేవలం ఒక ప్రొసీజరల్ డెవలప్మెంట్ మాత్రమేనని, దీనిని భారత అధికారులపై వచ్చిన ఆరోపణలకు తుది తీర్పుగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ విచారణలో నిందితులుగా ఉన్న భారతీయ అధికారులు ఈ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కొనేందుకు.. తమ వాదనలు వినిపించేందుకు పూర్తి అవకాశం ఉంటుందని పేర్కొంది.
రాయబార కార్యాలయానికి సమన్లు
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కూడా ఈ కేసుకు సంబంధించి కీలక చర్యలు చేపట్టింది. ఫారిన్ సార్వహెయిన్ ఇమ్యూనిటీస్ యాక్ట్ (FSIA) సెక్షన్ 1608(a)(4) ప్రకారం.. పన్నున్ దాఖలు చేసిన సమన్లు, ఫిర్యాదు పత్రాలను దౌత్య మార్గాల ద్వారా అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి అక్టోబర్ 9న అందజేసినట్లు వెల్లడించింది. తాము ఈ పత్రాలను చేరవేయడం అంటే పన్నున్ ఆరోపణలను సమర్థిస్తున్నట్లు కాదని.. కేవలం చట్టపరమైన బాధ్యతను మాత్రమే నిర్వర్తించామని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అసలు వివాదం ఏంటి?
ఖలిస్థాన్ ఉగ్రవాదిగా భారత్ చేత ప్రకటించబడిన గుర్వంత్ సింగ్ పన్నున్.. 'సిక్స్ ఫర్ జస్టిస్'సంస్థ జనరల్ కౌన్సిల్‌గా ఉన్నారు. 2023లో తనను హత్య చేయడానికి భారత్ కుట్ర పన్నిందంటూ 2024 సెప్టెంబర్‌లో ఆయన ఈ సివిల్ లా సూట్ దాఖలు చేశారు. ఇందులో భారత ప్రభుత్వం, అజిత్ దోవల్, సమంత్ గోయల్‌తో పాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ సివిల్ కేసు.. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చేపట్టిన మరో క్రిమినల్ దర్యాప్తునకు అనుబంధంగా నడుస్తోంది. పన్నున్‌ను హత్య చేయడానికి కిరాయి హంతకులను నియమించాడనే ఆరోపణలపై భారత్‌కు చెందిన నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్లో అరెస్ట్ చేసి అమెరికాకు రప్పించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నిఖిల్ గుప్తా ఫిబ్రవరి 2026లోనే నేరాన్ని అంగీకరించగా.. ఈ నెలలోనే అతని శిక్షాకాలం ఖరారు కానుంది.
ALSO READ : 3 కోట్ల కారు, 150 రకాల వంటకాలు..
భారత ప్రభుత్వం స్పందన.. ఏం జరగనుంది?
భారత ప్రభుత్వంపై వస్తున్న ఈ హత్యాయత్నం ఆరోపణలను భారత్ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. అమెరికా లేవనెత్తిన ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి భారత్ ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అలాగే అమెరికన్ అభియోగపత్రంలో పేరున్న వికాస్ యాదవ్ అనే వ్యక్తితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేవని అక్టోబర్ 2024లోనే విదేశీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గతంలో అజిత్ దోవల్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు సమన్లు అందాయన్న పన్నున్ వాదనను కూడా న్యూయార్క్ కోర్టు కొట్టివేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ సివిల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అజిత్ దోవల్, రా అధికారులపై న్యాయపోరాటానికి అమెరికా కోర్టు నుంచి తాజాగా వచ్చిన గ్రీన్ సిగ్నల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారిందని న్యాయ నిపుణులు అంటున్నారు.
