హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును సరైన పద్ధతిలోనే నిర్మించామని, అందులో ఎలాంటి లోపాలు లేవని బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉంటే వారు ధైర్యంగా ప్రాజెక్టు కింది భాగంలో నిలబడి గేట్లు ఓపెన్ చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై నమ్మకం ఉంటే తన డిమాండ్‌ను స్వీకరించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. మంగళవారం (నవంబర్ 10) ఎంపీ వంశీ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రస్తుత కరువు ఎల్ నినో తెచ్చింది కాదు కేసీఆర్ తెచ్చిన కరువని విమర్శించారు.
లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లగా రైతులకు మాత్రం చుక్క అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ధ్వంసమైందని మండిపడ్డారు. వేల కోట్ల ప్రజా ధనాన్ని కమిషన్ల కక్కుర్తి కోసం వృధా చేసి, ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని అన్నారు.
ప్రస్తుత కరువులో కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడం లేదని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని.. కానీ ఎన్డీఎస్ఏ భద్రత సూచనల మేరకే ప్రాజెక్టులో నీళ్లు నిలపడం లేదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల భద్రతే ముఖ్యమని పేర్కొన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లు ఎత్తొద్దని ఎన్డీఎస్ఏ చెప్పనప్పటికీ మోటార్లు ఆన్ చేయాలని ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని గద్దెనెక్కిన బీఆర్ఎస్ పది ఏండ్లలో ఎంత మందికి ఉద్యోగం, ఉపాధి కల్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి పార్లమెంటులో అనేక ఇబ్బందులు ఎదురైన అభివృద్ధి పనులు ఆపడం లేదని.. ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజాసేవే మార్గంగా ముందుకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. తాడిచెర్ల బ్లాక్-2 బొగ్గు కేటాయింపులను డైరెక్ట్ అలొకేషన్ చేయాలని పార్లమెంట్లో పలుమార్లు పోరాటం చేశానని చెప్పారు. త్వరలో రామగిరి ఖిల్లా రూపురేఖలు మారబోతున్నాయని.. రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్‌కు యువత నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.
ఖిల్లా అభివృద్ధిలో భాగంగా రూ.5 కోట్లతో రోప్‌వే, వాక్‌వే మంజూరయ్యాయని చెప్పారు. తన తండ్రి, మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఏటీసీఎస్ (ATC) శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ సుమారు 20 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. అలాగే, టామ్‌కామ్ (TOMCOM) ద్వారా తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా సుమారు 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
