పెళ్లిళ్లు అంటేనే ఖర్చులు, హడావుడి, సందడి. ఇక రాజకీయ నాయకుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన చిన్న కుమార్తె పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి కోసం కోట్ల రూపాయల విలువైన కార్లు, భారీ వివాహ వేదిక, గుర్రపు పందేలు, 150కి పైగా రకాల వంటకాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
నవంబర్ 25న జరగనున్న ఈ వివాహ వేడుక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్, భోజ్‌పురి కళాకారులతో పాటు దుబాయ్ నుంచి ఆరుగురు మోడళ్లను కూడా ఈ వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు పంపించారు.
పెళ్లికూతురికి రూ.3 కోట్ల విలువైన కారు గిఫ్ట్!
అనంత్ సింగ్ తన కుమార్తె శివాంగి సింగ్‌కు సుమారు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ఇప్పటికే లాడ్మా గ్రామానికి చేరుకుంది. అలాగే తన చిన్న కుమారుడు అభినవ్ కోసం సుమారు రూ.కోటి విలువైన BMW కారును కొనుగోలు చేశారు. పెళ్లి వేడుకలతో పాటు కుమారుడి జనేయు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.
శివాంగి సింగ్‌కు పాట్నాలోని బిహ్తా ప్రాంతానికి చెందిన కమాండెంట్ రణ్‌విజయ్ కుమార్ కుమారుడు రిషికేష్ కుమార్ అలియాస్ అంకిత్‌తో వివాహం జరగనుంది. రిషికేష్ MBA పూర్తి చేసి, గత 11 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు.
10 బీఘాలకు పైగా విస్తీర్ణంలో పెళ్లి వేదిక
ఈ వివాహం కోసం 3 ఎకరాలకి పైగా స్థలంలో భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు గుర్రపు పందేల కోసం దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు సుమారు 4 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు.
జైపూర్‌లోని పత్రకార్ చౌరహా తరహాలో జైమాల వేడుక కోసం దాదాపు 30 అడుగుల ఎత్తైన వేదికను నిర్మిస్తున్నారు. అలంకరణ కోసం చైనా, బెంగళూరు నుంచి పూలను తెప్పిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక అలంకరణ సామగ్రిని తీసుకొస్తున్నారు. టెంట్ ఏర్పాట్ల కోసం ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతం నుంచి ప్రత్యేక కార్మికులను రప్పించారు.
గుర్రపు పందేల్లో గెలిస్తే SUV కారు!
ఈ పెళ్లిలో మరో ప్రత్యేక ఆకర్షణ గుర్రపు పందేల పోటీలు. నవంబర్ 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా సహా పలు రాష్ట్రాల నుంచి గుర్రపు స్వారీ చేసే వారు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో విజేతకు SUV కారు, రెండో స్థానం సాధించిన వారికి బైక్, మూడో స్థానంలో నిలిచిన వారికి స్కూటీ బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని అనంత్ సింగ్ సహచరుడు మనీష్ కుమార్ వెల్లడించారు.
ALSO READ : రాహుల్ కంటే ముందే పుట్టిన కొడుకు చనిపోయిండు..
150కి పైగా వంటకాలతో ప్రత్యేక విందు
పెళ్లికి వచ్చే అతిథుల కోసం భోజన ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. మొత్తం 150కి పైగా రకాల వంటకాలను మెనూలో చేర్చారు. బీహార్ సంప్రదాయ వంటకాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను కూడా వడ్డించనున్నారు. స్వీట్లలో కాజు కట్లీతో పాటు నలంద ప్రాంతానికి ప్రత్యేకమైన సిలావ్ ఖాజాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఖాజా 52 పొరల ప్రత్యేక తయారీ విధానంతో ప్రసిద్ధి చెందింది.
ప్రముఖ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు
ఈ వివాహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లను ఆహ్వానించాలని అనంత్ సింగ్ భావిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ కుమార్‌కు ఇప్పటికే ఆహ్వానం అందించారు.
ఇదిలా ఉండగా, దుల్లార్‌చంద్ హత్య కేసులో డిసెంబర్ 4న లొంగిపోవాలని సుప్రీంకోర్టు అనంత్ సింగ్‌ను ఆదేశించింది. అయినప్పటికీ తన కుమార్తె పెళ్లికి వచ్చే అతిథుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు పాకిస్థాన్ సహా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చినా అతిథులకు స్వాగతం పలుకుతామని తెలిపారు.
మొత్తానికి కోట్ల రూపాయల కార్లు, లక్షల మంది అతిథులు, భారీ వేదిక, గుర్రపు పందేలు, 150 రకాల వంటకాలతో అనంత్ సింగ్ కుమార్తె వివాహం ఇప్పుడు బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
