అమెరికాకు చెందిన స్నాక్స్ అండ్ బెవరేజెస్ దిగ్గజం 'పెప్సికో' తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. నార్త్ అమెరికా ఫుడ్ అండ్ బెవరేజ్ వ్యాపార విభాగంలో సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాబోయే వారంలోపే ఈ తొలగింపు ప్రక్రియ పూర్తికానుందని సమాచారం. నార్త్ అమెరికా సీఈఓ రామ్ కృష్ణన్ సోమవారం (నవంబర్ 9) ఉద్యోగులకు రాసిన లేఖ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. కంపెనీని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అమెరికాలో అమ్మకాలు మందగించడం, పేలవమైన ఆర్థిక ఫలితాలు నమోదుకావడంతో పెప్సికో ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత నెలలో కంపెనీ తన పూర్తి సంవత్సరపు ఆదాయ అంచనాలను కూడా తగ్గించుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో నార్త్ అమెరికాలో సాఫ్ట్ డ్రింగ్స్ అమ్మకాలు 2 శాతం పడిపోగా, ఫుడ్ వాల్యూమ్స్ నిలకడగా ఉన్నాయి. అధిక ధరల కారణంగా వినియోగదారులు సోడాలు, ఖరీదైన స్నాక్స్ కొనుగోలుకు ఇష్టపడట్లే. మరోపక్క పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్ కూడా కంపెనీకి తలనొప్పిగా మారింది. ఎంతగా ధరలు తగ్గించినా.. మార్కెటింగ్ చేసినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు పెరగడం లేదని సీఎఫ్ఓ స్టీవ్ స్మిత్ తెలిపారు.
►ALSO READ | ఆయుష్మాన్ భారత్‌లో AI టెక్నాలజీ.. వేగంగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్!
పెట్టుబడిదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు కూడా ఈ లేఆఫ్స్‌కు మరో ప్రధాన కారణం. గత ఏడాది ప్రముఖ యాక్టివిస్ట్ ఫండ్ 'ఎలియట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్' సుమారు 4 బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసినప్పటి నుంచి పెప్సికో ప్రొడక్టివిటీని పెంచే చర్యలపై దృష్టి సారించింది. 2025 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3లక్షల 6వేల మంది ఉద్యోగులు ఉండగా.. కేవలం అమెరికాలోనే లక్షా 25వేల మంది పనిచేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ తొలగింపులు తక్కువే అయినప్పటికీ.. టెక్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం ఈ లేఆఫ్స్ నిర్ణయాన్ని సానుకూలంగానే స్వీకరించారు.
