Bhai Dooj 2026: బొట్టు పెట్టే ముందు పూజా పళ్ళెంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి.. మర్చిపోకండి!

 Bhai Dooj 2026: బొట్టు పెట్టే ముందు పూజా పళ్ళెంలో ఇవి తప్పనిసరిగా ఉండాలి.. మర్చిపోకండి!

దీపావళి ఐదు రోజుల పండుగలో చివరి రోజున భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున అక్కాచెల్లెళ్లు  వారి అన్నాతమ్ముళ్లకు నుదుటిపై తిలకం పెట్టి, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. అన్నాతమ్ముళ్లు  కూడా వారి అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇచ్చి, జీవితాంతం వారికి అండగా ఉంటామని మాట ఇస్తారు.

భాయ్ దూజ్ పండుగలో తిలకం పెట్టే కార్యక్రమానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో పూజా పళ్ళెం కూడా చాలా ముఖ్యమైనది. తిలకం పెట్టే ముందు పళ్ళెంలో అవసరమైన వస్తువులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. అయితే కొన్నిసార్లు హడావుడిలో కొన్ని వస్తువులను మర్చిపోతుంటారు. మరి భాయ్ దూజ్ పూజా పళ్ళెంలో ఏయే వస్తువులు ఉండాలో తెలుసుకుందామా....

భాయ్ దూజ్ పూజా పళ్ళెంలో ఉండాల్సిన వస్తువులు:

1.  కుంకుమ, గంధం : సోదరుడికి తిలకం పెట్టడానికి  కుంకుమ, గంధం పళ్ళెంలో తప్పనిసరిగా ఉంచుకోవాలి.
2. అక్షింతలు: తిలకం పెట్టిన తర్వాత నుదుటిపై అక్షింతలు వేస్తారు. ఇందుకోసం విరగని బియ్యపు గింజలను ఉపయోగించాలి. అక్షింతలు వేయడం శుభప్రదంగా భావిస్తారు.
3. నెయ్యి దీపం: సోదరుడికి హారతి ఇవ్వడానికి నెయ్యితో వెలిగించిన దీపాన్ని పళ్ళెంలో ఉంచుకోవాలి.
4. మిఠాయిలు: తిలకం కార్యక్రమం పూర్తయ్యాక సోదరుడికి స్వీట్లు తినిపిస్తారు. అందుకే పూజా పళ్ళెంలో మిఠాయిలు సిద్ధంగా పెట్టుకోవాలి.
5. కొబ్బరికాయ: భాయ్ దూజ్ పూజలో కొబ్బరికాయకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పూజా పళ్ళెంలో కొబ్బరికాయను ఉంచుకోవాలి.
6. పవిత్రమైన దారం: సోదరుడి కుడి చేతి మణికట్టుకు కట్టడానికి పవిత్రమైన దారంను పళ్ళెంలో ఉంచాలి. ఇది శుభానికి, రక్షణకు చిహ్నంగా భావిస్తారు.
7. తాజా పూలు: పూజా పళ్ళెం అందంగా కనిపించడంతో పాటు పూజలో ఉపయోగించేందుకు తాజా పూలను ఉంచుకోవాలి.
8. తమలపాకులు, వక్క: పూజా కార్యక్రమంలో శుభప్రదంగా భావించే తమలపాకులు, వక్కలను కూడా పళ్ళెంలో పెట్టుకోవాలి.

►ALSO READ | ఆధ్యాత్మికం: కార్తీకంలోఈ పూజ చేయండి.. ఇతరులను అవమానించిన దోషం పోతుంది.. ఇంద్రుడు చేసింది కూడా ఇదే..

తిలకం పెట్టేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
*భాయ్ దూజ్ రోజున సోదరుడు తిలకం పెట్టించుకునేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు చూసి కూర్చోవాలని సంప్రదాయం చెబుతోంది. దక్షిణం వైపు చూసి తిలకం పెట్టించుకోకూడదని నమ్ముతారు.
*తిలకం పెట్టడానికి ఎప్పుడూ విరగని పచ్చి బియ్యాన్ని మాత్రమే ఉపయోగించాలి.
*పూజ సమయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల  నల్లని దుస్తులు ధరించకూడదని సంప్రదాయం చెబుతోంది.
*తిలకం పెట్టే వరకు అక్కాచెల్లెళ్లు ఆహారం తీసుకోకూడదని కొన్ని ఆచారాల్లో పాటిస్తారు.

 భాయ్ దూజ్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల  మధ్య ప్రేమను, అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. ఈ రోజున సంప్రదాయం ప్రకారం పూజా పళ్ళెం సిద్ధం చేసుకుని, తిలకం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ముందుగానే పూజకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటే ఎలాంటి హడావుడి లేకుండా పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.