న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విడుదలైన గంటల వ్యవధిలోనే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోనియా పుస్తకంలోని పలు అంశాలపై బీజేపీ ఎదురు దాడి మొదలుపెట్టింది. 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని నిరాకరించడంపై కాంగ్రెస్, బీజేపీల మాటల యుద్ధం స్టా్ర్ట్ అయ్యింది.
2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించినప్పటికీ సోనియా ప్రధాన మంత్రి పదవిని స్వీకరించకుండా మన్మోహన్ సింగ్ పేరును సిఫార్స్ చేశారు. ప్రధాని పదవి చేపట్టాలని పార్టీ, సీనియర్ల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ తన అంతరాత్మ ప్రభోదం మేరకే తాను ఆ పదవిని నిరాకరించానని తన ఆత్మకథలో సోనియా గాంధీ పేర్కొన్నారు. బీజేపీ ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాత వాదననే మళ్లీ తెరపైకి తెచ్చింది.
2004లో సోనియా ప్రధాని పదవిని స్వీకరించేందుకు సిద్ధమయ్యారని.. ఈ మేరకు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ప్రమాణ స్వీకారం చేస్తానని లేఖ కూడా రాశారని ఆరోపించింది. అయితే, సోనియా గాంధీ విదేశీ మూలాలు (ఇటలీ సంతతి) కలిగిన మహిళ కావడంతో ఆమె దేశ ప్రధాని పదవికి అనర్హురాలని భావించి కలాం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడానికి నిరాకరించారని కాషాయ పార్టీ ఆరోపించింది. సోనియా గాంధీ ప్రధాని పదవిని స్వచ్ఛందంగా త్యాగం చేయలేదని, ఆమెను దేశవ్యాప్తంగా త్యాగాల దేవిగా చూపించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించింది.
►ALSO READ | రాహుల్ కంటే ముందే పుట్టిన కొడుకు చనిపోయిండు.. సోనియా జీవితంలోని అత్యంత విషాదకరమైన రహస్యం
అబ్దులా కలాం నిరాకరించడం వల్లే సోనియా గాంధీ ప్రధాని పదవికి దూరమయ్యారన్న చర్చ గతంలోనూ జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తన ఆత్మకథ 'టర్నింగ్ పాయింట్స్'లో అబ్దుల్ కలాం స్పష్టతనిచ్చారు. 2004లో సోనియా గాంధీ ప్రధాని కావడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అడ్డంకులు లేవని వివరణ ఇచ్చారు. ఒకవేళ సోనియా గాంధీ ప్రధాని పదవికి క్లెయిమ్ చేసి ఉంటే మెజారిటీ కూటమి నాయకురాలిగా ఆమెను నియమించడం మినహా తనకు వేరే ప్రత్యామ్నాయం ఉండేది కాదని స్పష్టం చేశారు.
