- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
కరీంనగర్, వెలుగు: త్వరలో కరీంనగర్‌లో లక్ష మందితో మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరుకానున్నారని అన్నారు. ‘సర్’ పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు.
నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్‌కు వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగరం పేరు మారుమోగేలా లక్ష మందితో మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాదయాత్ర ఏర్పాట్లపై మంగళవారం ఎంపీ కరీంనగర్‌లోని తన ఆఫీస్‌లో పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల బీజేపీ అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
