ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లకు మంత్రి పొన్నం సూచన

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. 	కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లకు మంత్రి పొన్నం సూచన

 హుస్నాబాద్, వెలుగు : ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లకు సూచించారు. రాజకీయాలకు సోషల్ మీడియానే కండ్లు, చెవులు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ  పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం  కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి కొత్తగా 5,230 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు.  

నవంబర్ 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి  ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జనవరిలో హుస్నాబాద్‌‌‌‌లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు, దీనికి  వందలాది కంపెనీలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.  గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు 173 గ్రామాల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలతో వాలీబాల్, కబడ్డీ కోర్టులు, ఓపెన్ జిమ్‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్‌‌‌‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని,  ఎల్లమ్మ చెరువు వద్ద గ్లాస్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ప్రారంభిస్తారన్నారు.  

కొత్తపల్లి–-హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి, 250 పడకల ఆస్పత్రి పనులను గడువులో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో తెలంగాణకు లభించిన స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ అవార్డును నేడు న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి  మంత్రి పొన్నం ప్రభాకర్ అందుకోనున్నారు. ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.