ప్రతి ఇంట్లో 20 శాతం నీళ్లను పొదుపు చేయాలె : వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

ప్రతి ఇంట్లో 20 శాతం నీళ్లను పొదుపు చేయాలె : వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి
  •     మంజీరా, సింగూరు నీళ్లు  45 రోజులకు సరిపోతయ్​ 
  •     15 నాటికి గోదావరి నుంచి అదనంగా 40 ఎంజీడీలు  
  •     వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి  

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ఎల్​నినో నేపథ్యంలో సిటీలో ప్రతి ఇంట్లో కనీసం 20 శాతం నీటిని పొదుపు చేస్తే భవిష్యత్తులో నీటి సమస్యే ఉండదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. ఇంట్లో ట్యాప్ లు వృథాగా వదలకుండా చూడటం, అవసరమైనంత నీటినే వినియోగించడం, లీకేజీలను అరికట్టడం వంటి చిన్న పనులతో నీటిని ఆదా చేయవచ్చన్నారు. మంగళవారం ఆయన వీ6 వెలుగుతో మాట్లాడుతూ   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 80 శాతం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగరంలో ప్రస్తుతం ఎక్కడా నీటి సరఫరాను నిలిపివేయడం లేదని, నీటి కొరత కూడా లేదన్నారు.

నగరంలో ఎవరికీ, ఏ ప్రాంతంలోనూ నీటి సరఫరా నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు. మరో 40 నుంచి 45 రోజుల పాటు మంజీరా, సింగూరు జలాలు సరిపోతాయని, ఆ జలాల సరఫరా నిలిచిపోతే రోజుకు సుమారు 100 ఎంజీడీల లోటు ఏర్పడుతుందన్నారు. ఆ లోటును అధిగమించేందుకు గోదావరి నుంచి 40 , కృష్ణా నుంచి 15 , హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మరో 5 ఎంజీడీల నీటిని తీసుకురావడానికి ప్లాన్లు రూపొందించినట్టు చెప్పారు. ఇప్పటికే గోదావరి అదనపు జలాలను సిటీకి తరలించే పనులను వేగవంతం చేశామని, నవంబర్ 15 నాటికి రోజుకు 40 ఎంజీడీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 

బిజినెస్​ చేసే ట్యాంకర్లపై చర్యలు  

భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో అక్రమ బోర్లు, నీటి వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ట్యాంకర్లపై హైడ్రా చర్యలు తీసుకుంటోందని, దానివల్ల కొన్ని ప్రైవేట్ హాస్టళ్లలో నీటి సమస్య ఏర్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎండీ చెప్పారు. అయితే, గృహ అవసరాలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లను అడ్డుకోవద్దని సీఎం సూచించారని, ఇండ్ల అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటిని పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. 

అయితే, అక్రమంగా నీటిని సేకరించి వాణిజ్య అవసరాలకు విక్రయించే ప్రైవేట్ ట్యాంకర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేయకుండా గ్రీన్ వాటర్ ట్యాంకర్లను వినియోగించాలని ఎండీ సూచించారు. గార్డెనింగ్, ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కేపింగ్, నిర్మాణ పనులు తదితర తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని కోరారు.