- జాన్హ్యారిసన్ నవలకు బుకర్‌ప్రైజ్..
- ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్’ కు దక్కిన అవార్డు
- బుకర్ ప్రైజ్ చరిత్రలోనే అత్యంత వృద్ధ విజేతగా నిలిచిన జాన్
లండన్: బ్రిటిష్ సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బుకర్ ప్రైజ్ ఈ ఏడాది సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రముఖ బ్రిటిష్సైన్స్ ఫిక్షన్, స్పెక్యులేటివ్ సాహిత్య రచయిత ఎం.జాన్ హారిసన్ 13వ నవల ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కు ఈ పురస్కారం దక్కింది. 81 ఏండ్ల వయసులో ఆయన ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా బుకర్ ప్రైజ్ చరిత్రలోనే అత్యంత వృద్ధ విజేతగా నిలిచారు. సైన్స్ ఫిక్షన్, జానర్ ఫిక్షన్‌లను చాలాసార్లు మెయిన్‌స్ట్రీమ్ లేదా సీరియస్ సాహిత్యానికి దూరంగా ఉంచుతారు. కానీ, జాన్ హారిసన్ తన ప్రయోగాత్మక రచనలతో ఆ అడ్డుగోడలను బద్దలు కొట్టారు. దశాబ్దాల క్రితం న్యూ వరల్డ్స్ వంటి మేగజైన్‌ల ద్వారా ప్రసిద్ధి చెందిన ఆయన, ఆర్థర్ సి.క్లార్క్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు.
సెటైరికల్ డిస్ట్రోపియన్ కథాంశం
ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇంగ్లండ్‌లోని చానెల్ తీర ప్రాంతంలో సాగే ఒక సెటైరికల్ డిస్ట్రోపియన్, పోస్ట్ -అపోకలిప్టిక్ కథాంశం. స్పష్టత లేని ఒక విపత్తు, విచిత్రమైన ఏలియన్ రూపాల రాక నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గన్ పట్టుకునే తన అత్తగారితో కలిసి తీరంలో నివసించే ఒక బీచ్‌కాంబర్ చుట్టూ కథ నడుస్తుంది. అతనికి ఒక వింతైన, ఆకారాలు మార్చుకునే కళాఖండం దొరకడంతో కథ మలుపు తిరుగుతుంది. ఈ పుస్తకంపై మాట్లాడిన జడ్జిల కమిటీ చైర్ పర్స్మేరీ బియర్డ్.. ఈ నవల చదువుతున్నంతసేపు పాఠకులను అటు ఇటు తిప్పేస్తుందని, ముగింపులో ఒక చిరునవ్వుతోపాటు ఆశను కూడా మిగులుస్తుందని ప్రశంసించారు. సంప్రదాయ సాహిత్యపు రూల్స్‌ను పక్కన పెట్టి, అనిశ్చితితో కూడిన వినూత్న శైలిలో సాగే ఈ నవల సాహిత్యాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చారిత్రక విజయం ద్వారా సైన్స్ ఫిక్షన్ రచనలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించినట్లయింది.
