సోనియాగాంధీ ఆత్మకథ..మేనక చెప్పిన అబద్ధం బాధించింది

సోనియాగాంధీ ఆత్మకథ..మేనక చెప్పిన అబద్ధం బాధించింది

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత  సోనియాగాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌‌‌‌: ఎ జర్నీ ఆఫ్‌‌‌‌ లవ్‌‌‌‌’లో  తోడికోడలు మేనకాగాంధీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 1973 చివర్లో మేనక, సంజయ్ గాంధీకి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటికీ ఆమె ఇంకా మైనరేనని గుర్తుచేసుకున్నారు. ఏడాది వ్యవధిలోనే వారి వివాహం జరగడం, 18 ఏళ్ల మేనక గాంధీ కుటుంబంలోకి ‘ఛోటీ బహు’గా రావడం, నాటి కుటుంబ వివాదాలు, తదనంతర రాజకీయ పరిణామాలు ‘రియాలిటీ షో’ను తలపించాయని సోనియా పేర్కొన్నారు. 

‘ఉత్సాహంగా ఉండే తోడికోడలు రావడంతో మొదట్లో ఇల్లంతా ఆహ్లాదంగా అనిపించేది. రానురాను చికాకులు మొదలయ్యాయి. ఆమె ఎప్పుడైనా కఠినంగా మాట్లాడినా.. ఇంట్లో ప్రశాంతత పోకూడదని మౌనంగా ఉండేదాన్ని. కానీ ఆ మాటల స్థాయి దాటితే సూటిగా సమాధానం చెప్పేదాన్ని.  సంజయ్, మేనకల మధ్య త్వరలోనే గొడవలు ప్రారంభమయ్యాయి.  మేనకా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాక  ఆమె కాస్త కుదురుకున్నట్లు కనిపించింది.  

అబద్ధాలు, అసత్య ప్రచారాలు

‘సంజయ్ రాజకీయాల్లోకి వచ్చాక, ప్రభుత్వ యంత్రాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధాని ఇందిరకు వ్యతిరేకంగా భావించేలా ఉండేవి. మేనక ఆయనను నిగ్రహించాల్సింది పోయి రెచ్చగొడుతోందని ఇందిరా గాంధీ భావించేవారు. ‘ఆమెకు అప్పుడే రెక్కలు వచ్చాయి’ (ఉస్కే అభి సే పర్ నికల్నే లగే హై) అని ఇందిర వ్యాఖ్యానించారు. 1978 ఎన్నికల ఓటమికి సంజయ్ కూడా ఓ కారణమని రాజీవ్ చెప్పడంతో కుటుంబం పట్ల మేనకకు ద్వేషం పెరిగింది. ‘అమ్మకు ఈ పరిస్థితి తీసుకువచ్చిన నిన్ను క్షమించలేను సంజయ్‌‌‌‌’ అని కుటుంబ చర్చలో భాగంగా రాజీవ్ అన్నారు. 

దాంతో మేనకాగాంధీ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా.. కాదని చెప్పగలవా అంటూ అత్తమ్మ గట్టిగా అడిగేసరికి ఆమె వెనక్కి తగ్గింది. నన్ను, రాజీవ్‌‌‌‌ను శత్రువులుగా చూసేది. తనకు టచ్‌‌‌‌లో ఉన్న కొందరు జర్నలిస్టులతో మా గురించి అవాస్తవ ప్రచారం చేసేది. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీవ్, నేను దేశం విడిచి పారిపోవాలని అనుకున్నామన్నది అబద్ధం’ అని పేర్కొన్నారు. ‘సంజయ్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత పరిస్థితులు మరింత జటిలమయ్యాయి. మేనకాకు రాజకీయ పదవి ఇవ్వాలని పార్టీలో కొందరు డిమాండ్ చేశారు. కానీ 23 ఏండ్ల వయసులో ఆమె ఇంకా పరిపక్వత చెందలేదని ఇందిరా భావించారు’ అని సోనియా  పేర్కొన్నారు.

ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది

ఫిరోజ్ వరుణ్ గాంధీ మొదటి పుట్టినరోజు వేడుకను ఆర్ఎస్ఎస్ మద్దతుదారు వసుంధర రాజే ఇంట్లో నిర్వహించడం, మేనక తన ‘సూర్య’ మ్యాగజైన్‌‌‌‌ను ఆర్ఎస్ఎస్  సభ్యుడికి అమ్మడం వంటి చర్యలు ఇందిరాగాంధీని  కలవరపెట్టాయని  తెలిపారు. చివరకు ఇందిరా గాంధీ లండన్‌‌‌‌లో ఉండగా, మేనకా తన వస్తువులు ఇంటి నుంచి తీసుకెళ్లిన విషయం తెలిసింది. దాంతో తిరిగి వచ్చిన తర్వాత ఆమెను మందలించారు. ‘ఈ పనులకు దూరంగా ఉండటమా లేక వేరే చోట నివసించడమా తేల్చుకోవాలి’ అని చెప్పారు. అందుకు అత్తమ్మతో పాటు రాజీవ్‌‌‌‌నూ నన్నూ నిందించింది. 

తరువాతి కాలంలో చిన్నారి ఫిరోజ్ వరుణ్‌‌‌‌ను చూడటానికి కోర్టు ద్వారా గాంధీ కుటుంబం యత్నించగా మేనక నిరాకరించారు. ఫిరోజ్ నాలుగో పుట్టినరోజున ఇందిరా గాంధీ పంపిన బహుమతులను నర్సరీ స్కూల్‌‌‌‌లో ఇవ్వడానికి సోనియా వెళ్లగా, ‘పిల్లవాడిని కిడ్నాప్ చేయడానికి సోనియా వచ్చింది’ అంటూ మేనక ప్రచారం చేయించారన్నారు.