- రాష్ట్రవ్యాప్తంగా 27 కేంద్రాల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
- 13 రకాల ఉల్లంఘనలు గుర్తింపు.. డాక్టర్లు, దళారుల పాత్రపై విచారణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమ అండాల సేకరణ వ్యవహారంపై వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన ఏడు ఏఆర్టీ (సంతాన సాఫల్య) కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో జీవో ఆర్టీ నం.176 ప్రకారం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ బృందాలు నాలుగు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రాల్లో ఇప్పటివరకు 27 చోట్ల తనిఖీలు పూర్తి చేశాయి. ఏడు ఆస్పత్రుల్లో అండాల సేకరణ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి 13 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించాయి. మిగిలిన కేంద్రాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
31 మంది మహిళల గుర్తింపు..
ఈ అక్రమ దందాలో ఇప్పటివరకు 31 మంది మహిళలను గుర్తించారు. అండాల సేకరణలో ఐవీఎఫ్ కేంద్రాలు, వైద్యులు, కమీషన్ల కోసం పనిచేసే మధ్యవర్తుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. నెట్వర్క్ గుట్టు విప్పేందుకు ఈ నెల 6న ఆరోగ్య శాఖ బృందం న్యూఢిల్లీలోని నేషనల్ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీని సందర్శించింది. తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, బ్యాంకుల పూర్తి వివరాలు కోరగా, డేటా అందజేస్తామని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ తెలిపింది. ఏఆర్టీ రెగ్యులేషన్ చట్టం-2021 ప్రకారమే అండాల సేకరణ జరగాలని, అన్ని క్లినిక్‌లు, బ్యాంకులు ప్రభుత్వ గుర్తింపు పొందాలని శాఖ స్పష్టం చేసింది. డబ్బు ఆశ చూపే దళారుల ప్రలోభాలకు లోనై ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని మహిళలకు సూచించింది. అక్రమ సేకరణపై సమాచారం తెలిస్తే డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
