సోనియాగాంధీ ఆత్మకథ: నా బిడ్డను నదిలో వదలడానికి ఒప్పుకోలేదు

సోనియాగాంధీ ఆత్మకథ: నా బిడ్డను నదిలో వదలడానికి ఒప్పుకోలేదు
  • 1969లో నెలలు నిండకుండానే మగబిడ్డ జననం.. మరుసటి రోజే కన్నుమూత
  • మెహ్రౌలీ ఫామ్‌లో ఖననం చేసిన రాజీవ్, సంజయ్
  • ఏడాదిన్నరకు రాహుల్ జననం

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ పుట్టడానికి ఏడాదిన్నర ముందే తనకు పుట్టిన తొలి బిడ్డ మరుసటి రోజే కన్నుమూశాడని, ఆ బిడ్డను నదిలో వదిలేయాలనే చర్చ వచ్చినప్పుడు అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వెల్లడించారు. 1969 జనవరి 18న ప్రసవ తేదీ కన్నా రెండు నెలల ముందే మగబిడ్డ పుట్టాడని తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో రాశారు. హిందూ సంప్రదాయంలో నవజాత శిశువును దహనం చేయరని, చివరికి మెహ్రౌలీలోని ఫిరోజ్ గాంధీ వ్యవసాయ క్షేత్రంలో రాజీవ్, సంజయ్ కలిసి ఖననం చేశారని తెలిపారు.

‘గుండె పగిలేలా ఏడ్చాను’

‘‘జనవరి 18, 1969.. ప్రసవ తేదీ కన్నా రెండు నెలల ముందే సాధారణ ప్రసవం ద్వారా ఓ మగబిడ్డకు జన్మనిచ్చా. ఇంక్యుబేటర్‌లో పెడుతున్నప్పుడు చిన్నారి మొదటి ఏడుపును విన్నాను. వాడిని చూపించడానికి రాజీవ్‌ నన్ను తీసుకెళ్లారు. నల్లని జుట్టు, పొడవాటి సన్నని వేళ్లు, చాలా చిన్నగా.. చక్కగా ఉన్నాడు. ఇద్దరం కలిసి శిశువును తదేకంగా చూస్తూ ఉండిపోయాం. కానీ, మా సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. చిన్నారి బతుకుతుందో లేదో చెప్పలేమని వైద్యులు తెలిపారు. 

మరుసటి రోజు ఉదయం రాజీవ్‌ నా దగ్గరకు వచ్చి బిడ్డను కాపాడుకోలేకపోయామని చెప్పారు. గుండె పగిలేలా రోదించాను. ఆయన కూడా వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఇందిరా గాంధీ తన పర్యటనను రద్దు చేసుకొని వెంటనే ఆస్పత్రికి వచ్చారు. ఎరుపెక్కిన కళ్లతో ఉన్న ఆమె మమ్మల్ని ఆలింగనం చేసుకుని, చాలా సేపు మాతోనే కూర్చున్నారు. భారమైన హృదయంతోనే మరుసటి రోజు పర్యటనకు వెళ్లారు’’ అని సోనియా పేర్కొన్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో మళ్లీ తల్లి కాబోతున్నానని తెలిసిందని, 1970 జూన్ 19న రాహుల్ పుట్టాడని పేర్కొన్నారు.