కరీంనగర్, వెలుగు: రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడానికి కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని, అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ముందుగా నగరంలోని ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ గేటు వరకు సీపీఐ నేతలు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు.
అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయని, వర్షపాతం తక్కువ నమోదు కావడం మూలంగా రైతులు వేసిన పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, మంత్రివర్గం ఆల్ పార్టీ లీడర్లను ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదన్నారు. కరీంనగర్ జిల్లాలో కేవలం మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని, అసలైన కరువుకు నిలయమైన మండలాలను ప్రకటించకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు.
ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి రూ.30 వేలు, పత్తి, మిర్చి పంటకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున పరిహారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి
పాల్గొన్నారు.
