భీమేశ్వర సన్నిధిలో కార్తీక వేడుకలు.. నవంబర్10 నుంచి డిసెంబర్ 8 వరకు పూజలు

భీమేశ్వర సన్నిధిలో కార్తీక వేడుకలు.. నవంబర్10 నుంచి డిసెంబర్ 8 వరకు పూజలు

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నవంబర్​10 నుంచి డిసెంబర్ 8 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. కార్తీకంలో మొదటి, రెండవ, నాల్గవ సోమవారం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏకాంతంగా, మూడవ సోమవారం భీమేశ్వర స్వామి ఆలయంలో మహలింగార్చనలు నిర్వహించనున్నారు. 

ప్రతి సోమవారం స్వామివారి కల్యాణ మంటపంలో కార్తీక మహాపురాణ ప్రవచనాలు, ఈ నెల 21న కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా లక్ష్మీ అనంతపద్మనాభ స్వామికి పంచామృతాభిషేకం, శ్రీ కృష్ణ తులసి కల్యాణం, 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధాన, అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. భీమేశ్వర స్వామి ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా జ్వాలాతోరణం, రాత్రి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిషిపూజ నిర్వహిస్తారు. 

వీటీడీఏ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష

 ఆలయాల అభివృద్ధి పనులు, 2027 పండుగల తేదీలను ఖరారు చేసేందుకు దేవాదాయ అధికారులు హైదరాబాద్ ప్రజాభవన్‌‌‌‌లో తెలంగాణలోని ప్రముఖ ఆలయాల అర్చకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత్​ రావు, రాష్ట్ర ధార్మిక అడ్వైజర్ గోవింద హరి పాల్గొన్నారు. 

వేములవాడ ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం, నూతన క్యాలెండర్‌‌‌‌ అందజేశారు. ఆలయంలో జరుగుతున్న పనుల గురించి ఈఓ రమాదేవి, వేములవాడ టెంపుల్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ అధికారులు వివరించారు.