హైదరాబాద్, వెలుగు: ఉప సర్పంచుల జాయింట్ చెక్ పవర్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప సర్పంచులకు చెక్‌పవర్ ఇవ్వడం వల్ల గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడ్తోందన్నారు. 2018కి ముందు ఉన్నట్టే స్టాంప్ డ్యూటీ, మైనింగ్, సీనరేజ్ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే జమ చేయాలని కోరారు.
హైదరాబాద్ లోని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన జిల్లా సర్పంచుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టం వల్ల గ్రామ పంచాయతీలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంచాయతీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన స్టాంప్ డ్యూటీ, మైనింగ్, సీనరేజ్ తదితర నిధులు అందకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.
