- ఇది ఎల్నితో వచ్చిన కరువు కాదు.. కేసీఆర్ తెచ్చిన కరువు
- బెల్లంపల్లి అభివృద్ధికి రూ.25 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు
- గాంధారీ ఖిల్లా, కోటిలింగాల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి
పెద్దపల్లి/కోల్‌బెల్ట్/బెల్లంపల్లి/జైపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వైఫల్యాలే ప్రస్తుత కరువు పరిస్థితులకు కారణమని ఆరోపించారు. ఇది ఎల్‌నినో ప్రభావంతో వచ్చిన కరువు కాదని, కేసీఆర్ తెచ్చిన కరువని మండిపడ్డారు. మరోవైపు సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలిచ్చేందుకు పెండింగ్‌లో ఉన్న 76 జీవోను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
మంగళవారం ఎంపీ వంశీకృష్ణ బెల్లంపల్లిలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకు ముందు పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం లోపాలకు బాధ్యత తీసుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోవడంతో నీటి పంపింగ్‌పై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
రిపేర్లు పూర్తిచేసి భద్రతపై ధ్రువీకరణ వచ్చేవరకు పంపులు ఆన్ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెప్పారని తెలిపారు. బ్యారేజీ వల్ల ప్రమాదం లేదని చెబుతున్న కేటీఆర్‌కు అంత నమ్మకముంటే కుంగిన బ్యారేజీ కింద నిలబడి పంపులు ఆన్ చేయాలని సవాల్ విసిరారు.
విద్యకు రూ.10 కోట్ల నిధులు
చెన్నూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో రూ.10 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ తెలిపారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. విశాక, కాకా చారిటబుల్ ట్రస్టుల ద్వారా 30 ఏండ్లుగా విద్యారంగ అభివృద్ధికి సహకరిస్తున్నామని తెలిపారు. ట్రస్టుల ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బోర్‌వెల్స్, తరగతి గదుల నిర్మాణం, ఫర్నిచర్, స్కూల్ బ్యాగులు, టీచర్లకు గౌరవ వేతనాలు అందిస్తున్నట్లు వివరించారు.
ఖిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
పెద్దపల్లి జిల్లాలో రామగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లతో రోప్‌వే మంజూరు చేయించినట్లు వంశీకృష్ణ తెలిపారు. ఇటీవల తాను చేసిన ట్రెక్కింగ్ చాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. మంచిర్యాల జిల్లాలోని గాంధారీ ఖిల్లా, కోటిలింగాల దేవాలయ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
జైపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 320 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలిగేడు మండలంలో ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి, సుల్తాన్పూర్ ప్రభుత్వ బడిలో విద్యార్థులకు కూడా ట్రస్ట్ ద్వారా బ్యాగులు అందజేశారు.
సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలు పంపిణి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో కలిసి 33వ వార్డులో 76 జీవో కింద మంజూరైన ఇంటి పట్టాలను వంశీకృష్ణ పంపిణీ చేశారు.దీనికి మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద రూ.45 లక్షలతో డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రత్నం సుకుమారి తదితరులు పాల్గొన్నారు.
