హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు స్టేషన్లను ఆధునీకరించాలని యాజమాన్యం నిర్ణయించింది. రైల్వే స్టేషన్ల మాదిరిగా ఆధునాతన హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో నిత్యం 5 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే 86 బస్సుస్టేషన్లను గుర్తించిన అధికారులు.. ఇందుకోసం రూ.20 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో ఆయా బస్సు స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయానికి అనుసంధానిస్తారు.
ఫలితంగా బస్సు స్టేషన్లలో రద్దీ, అక్కడ జరిగే కార్యాకలాపాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించే వీలు కలుగుతుంది. బస్సు వేళలను తెలిపే డిజిటల్ బోర్డులు సైతం ఏర్పాటు చేస్తారు. బస్సుల టైం టేబుల్, రూట్వివరాలు డిస్ప్లే ద్వారా ప్రయాణికులు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక అనౌన్స్ మెంట్లు చేయనున్నారు. జేబు దొంగలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక భద్రతా బలగాలను నియమిస్తారు.
ప్రయాణీకుల కోసం వెయిటింగ్ హాల్, కూర్చోవడానికి ఆధునాతన సీటింగ్ వ్యవస్థ, వెహికిల్ పార్కింగ్, ఆహ్లాద వాతావరణం కోసం ప్రత్యేక ల్యాండ్ స్కేపింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల స్థాయిలో రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్సు స్టేషన్లను కూడా ఆధునీకరించడంలో భాగంగానే ఈ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
