- మోదీ సర్కార్కు ‘హవా కా హిసాబ్’ చెప్పే ధైర్యముందా అని ప్రశ్న
న్యూఢిల్లీ, వెలుగు: వాయు కాలుష్యంలోనూ భారత్ ‘విశ్వగురువు’గా మారుతోందా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. కాలుష్యాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పరిమితమవుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ‘హవా కా హిసాబ్’(గాలి లెక్క) చెప్పే ధైర్యం చేస్తారా అని మంగళశారం ‘ఎక్స్’లో నిలదీశారు. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘స్వచ్ఛమైన గాలి ప్రజల ప్రాథమిక హక్కు. ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక హక్కు కాదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తాత్కాలికంగా ఉంటున్నాయి. గతేడాది కాలుష్య గణాంకాలను తగ్గించి చూపేందుకు ఏక్యూఐ కేంద్రాల వద్ద వాటర్ ట్యాంకర్లతో నీటిని చల్లారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది కాలుష్యం గరిష్ట స్థాయికి చేరిన సమయంలో ఢిల్లీలోని 59 పర్యవేక్షణ కేంద్రాల్లో 36 చోట్ల పీఎం2.5 గణాంకాలు కనిపించకుండా పోయాయి”అని ఆయన ఆరోపించారు.
గత 12 ఏండ్లుగా ప్రధాని మోదీ వాయు కాలుష్యంపై మాటలకే పరిమితమయ్యారని ఖర్గే విమర్శించారు. ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడుతున్నారని పేర్కొన్నారు. కాగా, వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో 2023లో 17,188 మంది మరణించినట్లు అంచనా వేసినట్టు ఖర్గే తెలిపారు.
