- అంతరాత్మ ప్రబోధం మేరకే నిర్ణయం తీసుకున్నా
- ఇందిర, రాజీవ్ హత్యలతో ప్రమాదకరమని ప్రియాంక, రాహుల్కు భయం.. అందుకే ఆ పదవే వద్దన్నారు
- కూటమి నేతల ఒత్తిడితో ఒక దశలో ‘ఠీక్ హై’ అన్నా..
- ‘ఎస్ అన్నావా?’ అంటూ రాహుల్ కోపంగా అడిగిండు
- తర్వాత మన్మోహన్ పేరు ప్రతిపాదించి తప్పుకున్నానన్న సోనియా గాంధీ
న్యూఢిల్లీ: అంతరాత్మ ప్రబోధం మేరకే 2004లో ప్రధాని పదవిని వద్దనుకున్నానని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వెల్లడించారు. నానమ్మ ఇందిరా గాంధీ హత్య, తండ్రి రాజీవ్ గాంధీ దారుణ హత్యను కండ్లారా చూసిన రాహుల్, ప్రియాంకల మనసుల్లో ఆ పదవి అంటేనే ప్రమాదం అనే భయం నాటుకుపోయిందని, అందుకే వాళ్లు తాను ప్రధాని కావడాన్ని అసలు ఒప్పుకోలేదని తెలిపారు. అయితే ఆ నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదని, కూటమి నేతల ఒత్తిడికి ఒక దశలో ‘ఠీక్ హై’ (సరే) అన్నా, చివరికి మనసు మాటే విని దృఢంగా ‘నో’ చెప్పానని పేర్కొన్నారు. మంగళవారం విడుదలైన తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో ఆ నిర్ణయం వెనుక తాను పడిన అంతర్మథనాన్ని సోనియా తొలిసారి బయటపెట్టారు.
‘అస్సలు వద్దు’
ఎన్నికలకు కొన్ని నెలల ముందే పార్టీ గెలిస్తే ప్రధాని పదవి చేపడతావా అని పిల్లలు అడగ్గా, ‘అస్సలు వద్దు’ అని గట్టిగా చెప్పానని సోనియా రాశారు. ఆ మాట విని పిల్లలు ఊపిరి పీల్చుకున్నారని, ఆ విషయం ఇంకెవరితోనూ చెప్పలేదని తెలిపారు. అయితే తన నిర్ణయంతో బాధపడే పార్టీ కార్యకర్తల పట్ల బాధ్యత కూడా తనను వెంటాడిందన్నారు.
మరి మా సంగతేంటి?
10 జన్పథ్లో కూటమి నేతలు తనను చుట్టుముట్టి ‘మీరు కాదనలేరు మేడమ్’ అంటూ ఒత్తిడి తేవడంతో, దాదాపు వినిపించనంత మెల్లగా ‘ఠీక్ హై’ అన్నానని, వెంటనే వాళ్లు అభినందనలు మొదలుపెట్టారని సోనియా గుర్తుచేసుకున్నారు.
బయట ఇది విన్న ప్రియాంక కన్నీళ్లతో రాహుల్ దగ్గరికి పరుగెత్తిందని రాశారు. ‘నువ్వు ఎస్ అన్నావా?’ అని రాహుల్ నిలదీయగా, తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పానని, ‘ఒత్తిడి నీ మీదేనా? మరి మా సంగతేంటి?’ అంటూ అతడు కోపంగా వెళ్లిపోయాడని తెలిపారు. ‘బలవంతంగా ఒప్పుకోవద్దమ్మా, నీ నిర్ణయమే అమలు చేయి’ అని ప్రియాంక ధైర్యం చెప్పిందన్నారు.
‘నీకు నువ్వు నిజాయితీగా ఉండు
ఆ రాత్రి ఇటలీలో పుట్టిన తాను వంద కోట్ల మంది దేశాన్ని నడిపించడమేంటని ఒక స్వరం, భర్తను కోల్పోయినప్పుడు అక్కున చేర్చుకున్న దేశం పట్ల బాధ్యతను ఎలా వదులుకుంటావని మరో స్వరం ప్రశ్నించాయని సోనియా రాశారు. ‘సోనియా, నీకు నువ్వు నిజాయితీగా ఉండు. వదిలేయ్’ అనే మాటతో సందేహాలన్నీ తొలగిపోయాయని, ఉదయమే రాహుల్ గదికి వెళ్లి నిర్ణయం చెప్పగా అతడు హత్తుకుని ‘ఇదే సరైన నిర్ణయం’ అన్నాడని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీల భేటీలో అంతరాత్మ ప్రబోధం మేరకు పదవిని వినమ్రంగా తిరస్కరిస్తున్నానని ప్రకటించి, మన్మోహన్ సింగ్ పేరు ప్రతిపాదించానని, ‘ఆ పరీక్ష చివరికి ముగిసింది’ అని పేర్కొన్నారు.
