పటాకులు కాల్చొద్దంటూ గొడవ.. రాష్ట్రపతి బాడీగార్డ్ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

పటాకులు కాల్చొద్దంటూ గొడవ.. రాష్ట్రపతి బాడీగార్డ్ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

లక్నో: దీపావళి పండుగ వేళ పటాకులు కాల్చే విషయంలో తలెత్తిన వివాదం ఓ ఆర్మీ జవాన్‎పై కాల్పులకు దారి తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 26 ఏళ్ల సౌరభ్ తోమర్ ఆర్మీ జవాన్. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు బాగ్‌పత్ జిల్లాలోని తన సొంత గ్రామం గోపాల్‌పూర్ ఖదానాకు రెండు రోజుల సెలవుపై వచ్చాడు. 

దీపావళి రాత్రి సౌరభ్ తన ఫ్యామిలీ మెంబర్స్‎తో ఇంటి బయట రోడ్డుపై పటాకులు కాలుస్తున్నాడు. ఈ క్రమంలో పొరుగున ఉండే ధీరజ్, మోనూ బాణా సంచా కాల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ధీరజ్ తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో సౌరభ్‎పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ సౌరభ్ తలలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సౌరభ్‎ను హుటాహుటిన బరౌత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‎కు తరలించారు. 

అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం మీరట్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడ వైద్యులు సౌరబ్‎కు ఆపరేషన్ చేసి తల నుంచి బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ధీరజ్, మోనూలపై రమాలా పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు అయ్యింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.