భర్త ఎప్పుడూ ఆమె మొబైల్ చెక్ చేస్తుంటాడనే కారణంతో ఈ మధ్యే విడాకులు తీసుకుంది అంకిత (పేరు మార్చాం). ఆ తర్వాత ఏడాదికి మరో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండో మ్యారేజ్ ఇప్పుడు ప్రాబ్లంలోనే ఉంది. భార్య జాబ్ చేయకుండా, ఇంటిపట్టునే ఉండాలనేది దేవాన్ష్ (పేరు మార్చాం) కోరిక. కానీ, భార్య మాత్రం జాబ్ చేస్తానంది. దీంతో ఇద్దరికీ సరిపడక డివోర్స్ తీసుకున్నారు.
దేవాన్ష్ డివోర్స్ తీసుకున్న రీజన్ చాలా మందికి నచ్చలేదు. దీంతో చుట్టుపక్కల వాళ్ల నుంచి విమర్శలు. కారణాలేవైతేనేం.. విడాకులు తీసుకోవడం ఈజీ. ఆ తర్వాత పరిణామాల్ని ఎదుర్కోవడమే కష్టమైన విషయం. చిన్న చిన్న కారణాలు.. పరిష్కరించుకోగలిగే ప్రాబ్లమ్స్ అయినా డివోర్స్ తీసుకుంటున్న జంటలు ఆ తర్వాత తమకు ఎదురయ్యే పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతున్నాయి.
పార్ట్నర్ నుంచి వేధింపులు, ఆంక్షలు ఎదురైనా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, కెరీర్ విషయంలో సపోర్ట్ చేయకపోయినా, వివాహేతర సంబంధాలు ఉన్న విషయం తెలియడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.. ఇలా పలు కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. అన్నింటికంటే ఎక్కువగా భాగస్వామి నుంచి కోరుకునేది ఆత్మ గౌరవం. అది పోగొట్టుకుని, సర్దుకుపోవడం ఇష్టం లేక విడాకులు కోరుతున్నారు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ విడాకుల తర్వాత కూడా దక్కేలా చూసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ నుంచి సహకారం అందినప్పుడే ఇది సాధ్యం.
ఫ్యామిలీ సపోర్ట్
కూతురు లేదా కొడుకు విడాకులు తీసుకోవాలనుకుంటే అందుకు కారణాలను పేరెంట్స్ తెలుసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగి, తిరిగి వాళ్ల రిలేషనషిప్ను గాడిలో పెట్టగలమనుకుంటే ఆ ప్రయత్నం చేయాలి. కుదరని పక్షంలో, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు. అయితే ఈ టైంలో కచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ ఉండాలి.
మరో రిలేషన్ ?
ఒకరి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఏదో ఒక టైంలో మరో రిలేషన్ షిప్ స్టార్ట్ చేయొచ్చు. అయితే మరో రిలేషన్ షిప్‌లోకి వెళ్లేముందు ఎవరికి వాళ్లు కొన్ని విషయాల్లో రియలైజ్ అవ్వాలి. పాత రిలేషన్ షిప్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? ఒకవేళ మళ్లీ అదే పరిస్థితి వస్తే తట్టుకోగలరా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. సరైన పార్టనర్ అనుకున్నప్పుడే కమిట్ అవ్వాలి.
సమస్య మీలోనే ఉందా ?
విడాకులు తీసుకున్నప్పుడు ప్రతిసారీ పొరపాటు భాగస్వామిదే అయ్యుండనక్కర్లేదు. ఇందులో మీ వైపు నుంచి ఏదైనా సమస్య ఉందేమో. ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు రెండోసారి కూడా అదే కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. అంటే సమస్య వాళ్లలోనే ఉంది. అలాంటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ లోపాన్ని సరిదిద్దుకోలేకపోతే, అడ్జస్ట్ కాలేకపోతే ఏ రిలేషన్ షిప్ అయినా తొందరగానే బ్రేక్ అవుతుంది.
కెరీర్ ప్లాన్
రిలేషన్ షిప్ బ్రేక్ అయితే బాధపడుతూ కూర్చోకుండా, ఆ పరిస్థితి నుంచి త్వరగా బయటపడే ప్రయత్నం చేయాలి. ఆడవాళ్లెతే ఏదో ఒక కెరీర్‌పై దృష్టిపెట్టాలి. మగవాళ్లైనా కెరీర్లో మరింతగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలాగే వీలైనంత సోషల్‌గా ఉండేందుకు ప్రయత్నించాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించాలి.
పొరపాట్లు సరిదిద్దుకోవాలి
ఈ మధ్య ఎక్కువ మంది పెళ్లైన కొద్దికాలానికే విడాకులు తీసుకుంటున్నారు. చాలా మంది పెళ్లి తర్వాత తలెత్తే మనస్పర్థలకు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల రిలేషన్ షిప్‌లోనే పార్టనర్‌పై ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకుంటున్నారు. అంతేకానీ, తమలో ఏ లోపం ఉంది? దాన్ని ఎలా మార్చుకోవాలి? రిలేషన్ షిప్‌ను తిరిగి ఎలా నిలబెట్టుకోవాలి? అని ఆలోచించడం లేదు.
దీనివల్ల ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి మరో రిలేషన్ షిప్లో కూడా ఇవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మ్యారేజ్ లైఫ్‌లో ఎదురయ్యే సమస్యలు, పార్ట్నర్ నుంచి కాకుండా 'తన' నుంచే వస్తున్నాయని తెలుసుకుని, మార్చుకుంటే రిలేషన్ షిప్ బాగుంటుంది.
