బజార్ హత్నూర్/ నేరడిగొండ, వెలుగు: దీపావళి సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారి -గుస్సాడి వేడుకలు అత్యంత వైభవంగా ముగిసాయి . ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్స్వగ్రామం బజార్ హత్నూర్ మండలం జాతర్లలో మంగళవారం ఈ ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. 35 నుంచి 40 గ్రామాల నుంచి వచ్చిన దండారి గుస్సాడి బృందాలు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నాయి.
బృందాలకు బహుమతులు అందజేసి సత్కరించారు. ఎంపీ గోడం నగేశ్పటేళ్లు, దేవారీలతో కలిసి ఆదివాసీల ఆరాధ్య దైవాలైన ఎత్మాసూర్, గుస్సాడి దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో ఆకర్షణగా నిలిచారు. గోండి భాషలో మాట్లాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటిపల్లి రాజు, ఏపీఓ ఆత్రం భాస్కర్, టీడబ్ల్యూ డీటీడీఓ గోడం చందన్, నాయకులు జి.వి. రమణ, పెందూర్ తులసీరామ్, వివిధ గ్రామాల పటేళ్లు, దేవారీలు, అధికారులు పాల్గొన్నారు.
సంప్రదాయాల పరిరక్షణకు ప్రయారిటీ
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. నేరడిగొండ మండలం లకంపూర్ లో గుస్సాడీ దండారి బృందాలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం మండలంలోని చించోలిలో ఆశ్రమ స్కూల్ ను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, స్కూల్ నిర్వహణ, మౌలిక వసతులను పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ బిల్డింగ్, సీసీ రోడ్ల పనులపై ఆరా తీశారు.
