- ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో టీమిండియా
- 19 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్
హామిల్టన్: భారీ వర్షం కారణంగా.. ఇండియా, న్యూజిలాండ్ మధ్య మంగళవారం జరగాల్సిన మూడో వన్డే రద్దయ్యింది. రోజంతా కురిసిన వర్షం వల్ల గ్రౌండ్ చిత్తడిగా మారింది. దాంతో ఒక్క బాల్ కూడా సాధ్యపడలేదు. మధ్యలో వాన కాస్త తెరిపినివ్వడంతో 40 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ వరుసగా మూడోసారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
తొలి రెండు వన్డేల్లో ఆడిన జట్టునే యధావిధిగా కొనసాగించారు. అయితే కొద్దిసేపటికే భారీ వర్షం రావడంతో గ్రౌండ్‌ను కవర్లలో కప్పి ఉంచారు. 20 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించడానికి సాయంత్రం 7.50 గంటల వరకు గడువు ఉన్నా.. అంపైర్లు 70 నిమిషాల ముందే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇండియా 2–0 ఆధిక్యంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌లు ఈ నెల 13, 15వ తేదీల్లో టౌరంగలో జరగనున్నాయి.
11 వరుస విజయాలకు బ్రేక్..
మూడో వన్డే రద్దయినా టీమిండియా.. కివీస్‌ను భారీ దెబ్బ కొట్టింది. సొంతగడ్డపై ఆ జట్టు 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలకు బ్రేక్ వేసింది. 2018–19 సీజన్ నుంచి స్వదేశంలో జరిగిన ప్రతి సిరీస్‌ను కివీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడో వన్డే రద్దు కావడంతో న్యూజిలాండ్ సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఒకవేళ చివరి రెండు వన్డేలు గెలిచినా సిరీస్ సమమవుతుంది. 2018కు ముందు చివరిసారిగా ఇండియా చేతిలోనే ఓడిన కివీస్.. ఆ తర్వాత స్వదేశంలో వరుసగా బంగ్లాదేశ్, ఇండియా, నెదర్లాండ్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌పై సిరీస్‌లు గెలిచింది.
కెప్టెన్‌గా శ్రేయస్..
కివీస్‌తో జరిగే చివరి రెండు వన్డేలకు శుభ్‌మన్ గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 19 నుంచి మొదలయ్యే టెస్ట్ సిరీస్ కోసం గిల్.. సన్నాహాలు మొదలుపెట్టనున్నాడు. గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, సిరాజ్ త్వరలో వెల్లింగ్టన్‌లో టెస్ట్ జట్టుతో కలవనున్నారు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ చివరి రెండు వన్డేల కోసం తుది జట్టులోకి రానున్నారు.
