హైదరాబాద్, వెలుగు: తహసీల్దార్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లకు సంబంధించిన ఫైలును త్వరితగతిన ఆమోదించాలని కోరుతూ సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసింది. సీఎంవోలో పెండింగ్లో ఉన్న ప్రమోషన్ల ఫైలుకు మోక్షం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ట్రెసా నేతలు కోరగా.. శేషాద్రి సానుకూలంగా స్పందించారు.
ముందుగా రెవెన్యూ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 25 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల ఆమోదంపై సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలకు సంబంధించి కూడా సంబంధిత అధికారులతో మరోసారి చర్చించి, సమగ్ర నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకుంటామన్నారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిని కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు కె.గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎల్.రమణారెడ్డి తదితరులున్నారు.
