ఆర్టీసీ ఏసీ బస్టాపుల్లో దందా..ఇది యాపారం..!..ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యాపారులకు అద్దెకు...

ఆర్టీసీ ఏసీ బస్టాపుల్లో దందా..ఇది యాపారం..!..ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసి  ప్రైవేట్ వ్యాపారులకు అద్దెకు...
  •     జిరాక్స్, స్టేషనరీ, కేఫ్​ల ప్రత్యక్షం
  •     మరికొన్ని చోట్ల ‘స్పేస్ ఫర్ రెంట్’ బోర్డులు
  •     అన్నిచోట్లా పని చేయని ఏసీలు 
  •     కనిపించని ఫ్యాన్లు, ఛార్జింగ్ పాయింట్లు
  •     అధికారుల పాత్రపైనా అనుమానాలు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  సిటీలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఏసీ బస్టాప్​లు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రయాణికులకు నీడనివ్వడంతో పాటు కూర్చునేందుకు, సేదతీరేందుకు సౌకర్యాలు కల్పించాల్సిన బస్టాపుల్లో కేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కాఫీ షాపులు, జిరాక్స్ సెంటర్లు వెలుస్తున్నాయి. నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు ప్రకటనల ప్రదర్శనకే పరిమితం కాకుండా..అక్కడి ఖాళీ స్థలాలను సైతం ప్రైవేట్ వ్యాపారులకు అద్దెకు ఇస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల అద్దెలకు ఇచ్చేసిన ఏజెన్సీలు..మరికొన్ని చోట్ల ‘స్పేస్ ఫర్ రెంట్’ బోర్డులు పెట్టాయి. దీంతో ప్రయాణికులకు నిలబడే చోటు కూడా లేకుండా పోతోంది. మరోవైపు రూ.లక్షలతో నిర్మించిన ఈ బస్టాపుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 

అసలు లక్ష్యం ఏంటంటే..  

క్యూర్ పరిధిలో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణించాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పలు చోట్ల ఏసీ బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసింది. ఇందులో ఏసీతో పాటు, టాయిలెట్లు, ఫ్యాన్లు, మొబైల్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే, నిర్వహణను అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో భాగంగా ఏజెన్సీలు బస్టాప్​లపైన ప్రకటనలు ఏర్పాటు చేసి వాటి నుంచి వచ్చే ఆదాయంతో మెయింటనెన్స్​చేయాలన్నది ఒప్పందం. 

ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే..

సదరు ఏజెన్సీలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పొందుతూ నిర్వహణను మాత్రం గాలికి వదిలేశాయి. పైగా, బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోని ఖాళీ స్థలాలను పలువురు వ్యాపారులకు రెంట్​కు ఇస్తూ అదనపు ఆదాయం పొందుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల జిరాక్స్​సెంటర్లు, బేకరీలు, కాఫీ సెంటర్లు, స్టేషనరీ, మొబైల్​యాక్సెసరీస్​నడుస్తుండగా మరికొన్ని చోట్ల ‘స్పేస్ ఫర్ రెంట్’ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు బస్సుల కోసం వేచి ఉండేందుకు సరైన స్థలం లేక రోడ్డు పైనే నిలబడుతున్నారు.  

బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ముందే పార్కింగ్

బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వ్యాపారాలు నిర్వహించడం మరో సమస్యకు దారితీస్తోంది. ఆయా షాప్స్ కి వచ్చే కస్టమర్లు తమ వాహనాలను బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ముందే పార్క్​చేస్తున్నారు. దీంతో బస్సులు బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలోకి వచ్చి ఆగేందుకు స్థలం లేక రోడ్డుపైనే నిలపాల్సి వస్తున్నది. బస్సులు స్థలం లేక బస్టాపులను దాటి ఆగుతుండడంతో ప్రయాణికులు బస్సెక్కడానికి పరుగులు తీయాల్సి వస్తున్నది. 

అధికారులు ఏం చేస్తున్నట్టు? 

నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలు వ్యాపారాలు నిర్వహిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే వారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్మెంట్ విభాగం అధికారుల పాత్రపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి.  బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన తర్వాత యాడ్ ఏజెన్సీల పనితీరును, వారు సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా... ఎక్కడా తనిఖీలు చేసిన సందర్భం లేదు. ఇప్పటికైనా రూల్స్​పాటించకుండా ఆదాయంపైనే దృష్టి పెట్టి ఏసీ బస్టాపుల నిర్వహణను గాలికి వదిలేసిన యాడ్​ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. 
 
13 బస్టాపుల్లో సమస్యలే.. 
దేశంలో ఎక్కడా లేని  విధంగా ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు అందులో ఫెసిలిటీస్ కల్పించే విషయాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు. కొన్నేండ్ల కింద సిటీలో 14 ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ జోన్ లో మెహిదీ పట్నం, ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసు, ఎస్ఆర్ నగర్, కోఠి, కూకట్ పల్లి జోన్ లో కేపీహెచ్ బీ, ప్లాటినం మాల్, సికింద్రాబాద్ జోన్ లో శివం రోడ్, తార్నాక, బేగంపేట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చార్మినార్ జోన్ లో ఆరాంఘర్, దిల్ సుఖ్ నగర్, శేరిలింగంపల్లి జోన్ లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మెహిదీపట్నం వద్ద  స్కై వాక్ నిర్మాణంలో భాగంగా తొలగించగా, మిగతా ఏ బస్టాపు ఉపయోగకరంగా లేదు. ఏ బస్టాపులోనూ ఏసీలు పనిచేయడంలేదు. కొన్ని బస్ షెల్టర్లలో చెత్తా చెదారం పేరుకుపోతోంది. తరచూ శుభ్రం చేస్తున్న దాఖలాలు లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దుర్వాసన, ఉక్కపోతతో ప్రయాణికులు అసలు బస్ షెల్టర్లలోకే రావడం లేదు. మరికొన్ని బస్ షెల్టర్ల ముందు మురుగు ఏరులై పారుతోంది. కొన్ని షెల్టర్లకు అయితే తాళాలు వేసేశారు.