- పది రోజుల్లోనే పత్తి ధరపై రూ.వెయ్యికి పైగా కత్తెర
- బియ్యం మాత్రం కిలో రూ.90 నుంచి 98 రూపాయలు
- మిల్లర్లు, వ్యాపారుల సరికొత్త సిండికేట్ దందా
హైదరాబాద్, వెలుగు:సీజన్ ప్రారంభంలో పంటకు మంచి రేటు ఇచ్చి ఆశలు రేకెత్తించిన వ్యాపారులు, ధాన్యం మార్కెట్‌కు రావడం మొదలవగానే పక్కా వ్యూహంతో ధరలు తగ్గిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే పత్తి ధర క్వింటాల్‌కు రూ.వెయ్యికి పైగా పడిపోగా, మొన్నటిదాకా రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలికిన సన్నవడ్లు ఇప్పుడు కొన్నిచోట్ల రూ.2,500కే అమ్ముకోవాల్సి వస్తోంది. ఇటీవల వడ్ల రేట్లు పెరిగాయనే సాకుతో సన్నబియ్యాన్ని కిలో రూ.98 దాకా తీసుకెళ్లిన వ్యాపారులు, ఇప్పుడు వడ్ల రేట్లు తగ్గినా బియ్యం ధరలు మాత్రం తగ్గించడం లేదు. వ్యాపారులు, మిల్లర్ల సిండికేట్ ఉచ్చులో పడి అటు రైతులు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు.
పత్తి రేట్లకు కత్తెర
2026–27 వానాకాలం సీజన్‌కు కేంద్రం క్వింటాల్ పత్తికి రూ.8,667 కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించింది. సీజన్ ప్రారంభంలో రాష్ట్రంలోని పలు మార్కెట్లలో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించడంతో ఈసారి మేలు జరుగుతుందని రైతులు ఆశించారు. కానీ పది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం పలు మార్కెట్లలో క్వింటాల్ ధర రూ.7,300 నుంచి రూ.8,500 మించడం లేదు. కొన్నిచోట్ల మద్దతు ధర కన్నా తక్కువకే కొంటున్నారు. నాణ్యత, తేమ పేరుతో ధరల్లో కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పత్తి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేసి డిసెంబర్ 31 వరకు పొడిగించడంతో విదేశీ పత్తి దిగుమతులు పెరిగి ఇక్కడ రేట్లు తగ్గుతున్నాయంటున్నారు. దీంతో రైతులు ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు.
సన్నవడ్లకు ఒక్కసారిగా కోత
సీజన్ ప్రారంభంలో సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల దాకా రేటు పెట్టడంతో రైతులు సంబరపడ్డారు. మిల్లర్లు, వ్యాపారులు హార్వెస్టర్ యజమానుల ద్వారా ముందే సమాచారం సేకరించి, గ్రామాల్లో ఏజెంట్లను పెట్టి, అడ్వాన్సులు ఇచ్చి మరీ పొలాల దగ్గరే పచ్చి ధాన్యం కొన్నారు. అదే సమయంలో ఎల్‌నినోతో ఈసారి వరి దిగుబడి తగ్గుతుందని, సన్నబియ్యం కొరత వస్తుందని భయాందోళనలు రేకెత్తించి, ఉన్న బియ్యాన్ని బ్లాక్ చేసి కిలో రూ.90 నుంచి రూ.98 వరకు పెంచారు. అనుకున్నట్లు బియ్యం రేట్లు పెంచుకున్నాక, ఇప్పుడు సిండికేట్‌గా మారి వడ్ల రేట్లు తగ్గిస్తున్నారు. పలు జిల్లాల్లో సన్నవడ్లను క్వింటాల్‌కు రూ.2,900 నుంచి రూ.3,200కే కొంటున్నారు.
వడ్లు తగ్గినా బియ్యం తగ్గట్లే
బియ్యానికి ముడిసరుకైన వడ్ల రేట్లు తగ్గుతున్నా, సన్నబియ్యం మాత్రం రకాన్ని బట్టి కిలో రూ.90 నుంచి రూ.98కే అమ్ముతున్నారు. బియ్యం రేట్లు పెంచి పాత స్టాక్‌పైనా అడ్డగోలు లాభాలు గడించిన వ్యాపారులు, మిల్లర్లు ఇప్పుడు రైతుల నుంచి కొనే వడ్ల రేట్లను ఎలా తగ్గిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. బియ్యం రేట్లు పెరగడానికి, వడ్ల రేట్లు తగ్గడానికి సిండికేటే కారణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
