వెలుగు స్పెషల్ : తెలంగాణ విద్యుత్ రంగం.. అభివృద్ధా? సంక్షోభమా?

వెలుగు స్పెషల్ : తెలంగాణ విద్యుత్ రంగం.. అభివృద్ధా? సంక్షోభమా?

విద్యుత్ ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఉత్పాదక వనరు. పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేవారంగ విస్తరణ, పట్టణీకరణ, ఐటీ రంగ అభివృద్ధి వంటి అన్ని కార్యకలాపాలు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాపై ఆధారపడి ఉంటాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించడం, గృహ, పారిశ్రామిక వినియోగదారుల అవసరాలను తీర్చడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 7,778 మెగావాట్లుగా ఉన్న ఒప్పంద విద్యుత్ సామర్థ్యం 2023 డిసెంబర్ నాటికి 19,475 మెగావాట్లకు పెరిగింది. ఇది విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో గణనీయమైన ప్రగతి. అయితే ఈ భౌతిక ప్రగతికి అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) ఆర్థిక పరిస్థితి బలోపేతం కాలేదు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే.

2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 2023 అక్టోబర్ నాటికి తెలంగాణ డిస్కంల అప్పులు రూ.81,516 కోట్లు, పేరుకుపోయిన నష్టాలు రూ.62,461 కోట్లకు చేరాయి. జనరేటర్లకు చెల్లింపుల కోసం తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రూ.30,406 కోట్లు కాగా, జనరేషన్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.28,673 కోట్లు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు రూ.28,842 కోట్లుగా, ఇందులో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.14,193 కోట్లుగా నమోదయ్యాయి. 

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2024–25 పనితీరు గణాంకాల ఆధారంగా 2026లో వెలువడిన నివేదికల్లో తెలంగాణ డిస్కంలలో  పేరుకుపోయిన నష్టాలు సుమారు రూ.69,741 కోట్లుగా, అప్పులు రూ.59,230 కోట్లుగా పేర్కొన్నారు.  వేర్వేరు నివేదికల్లో కనిపించే నష్టాల మొత్తాలు లెక్కల పద్ధతి, నివేదికల కాలపరిమితి ఆధారంగా మారవచ్చు. అయినప్పటికీ, ఈ గణాంకాలు డిస్కంల  సమస్య తాత్కాలికమైనది కాదని, దీర్ఘకాలంగా పేరుకుపోయిన నిర్మాణాత్మక ఆర్థిక సంక్షోభమని స్పష్టం చేస్తున్నాయి. 

డిస్కంల మొత్తం వ్యయంలో విద్యుత్ కొనుగోలు ప్రధాన భాగం కావడం ఈ సంక్షోభానికి మరో కారణం.  విద్యుత్ కొనుగోలు వ్యయం పెరుగుతున్నప్పటికీ, దానికి అనుగుణంగా వినియోగదారుల నుంచి ఆదాయం సమకూరకపోతే ప్రతి యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నష్టం ఏర్పడుతుంది. ఈ లోటును రుణాల ద్వారా భర్తీ చేయడం వల్ల వడ్డీ భారం పెరిగి, భవిష్యత్తులో మరింత ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది. 

సంక్షోభానికి ప్రధాన కారణాలు

మొదటిది.. సబ్సిడీ చెల్లింపుల్లో జాప్యం.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం సామాజిక సంక్షేమం దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత కలిగినవి. అయితే ఈ పథకాల ఖర్చును ప్రభుత్వం బడ్జెట్ ద్వారా పూర్తిగా, సమయానికి చెల్లించకపోతే ఆర్థిక భారం డిస్కంలపై పడుతుంది. సబ్సిడీని ప్రకటించడం ఒక విధాన నిర్ణయం అయితే, దానికి అవసరమైన నిధులను సమయానికి విడుదల చేయడం ఆర్థిక బాధ్యత. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడం డిస్కంల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. 

రెండోది.. ప్రభుత్వ శాఖల బకాయిలు. ముఖ్యంగా సాగునీటి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విద్యుత్ వినియోగానికి సంబంధించిన బకాయిలు డిస్కంలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ప్రభుత్వ శాఖలు విద్యుత్ వినియోగించి బిల్లులు చెల్లించకపోతే డిస్కంలకు ఆదాయం పుస్తకాలలో కనిపించినప్పటికీ నగదు అందదు. ఫలితంగా డిస్కంలు జనరేటర్లకు చెల్లింపులు ఆలస్యం చేస్తాయి. జనరేటర్లు బొగ్గు సరఫరాదారులకు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇలా ఏర్పడిన నగదు కొరత మొత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థకు వ్యాపిస్తుంది.

మూడోది.. అధిక వడ్డీ భారం.  అప్పులపై ఆధారపడే పరిస్థితి కొనసాగడం వల్ల డిస్కంలు ప్రతి సంవత్సరం భారీ మొత్తాలను వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోంది. ఈ నిధులను కొత్త సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిషన్ లైన్లు, ఆధునిక పంపిణీ వ్యవస్థల అభివృద్ధికి వినియోగించే అవకాశం తగ్గిపోతుంది.  నాలుగోది.. పంపిణీ వ్యవస్థలో సామర్థ్య లోపాలు. సాంకేతిక నష్టాలు, విద్యుత్ చౌర్యం, మీటరింగ్,  బిల్లింగ్ లోపాలు, బిల్లుల వసూళ్లలో జాప్యం డిస్కంల ఆదాయాన్ని తగ్గిస్తున్నాయి. 2024–25లో తెలంగాణ AT&C నష్టాలు సుమారు 20 శాతానికి చేరడం పంపిణీ వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల అవసరమని సూచిస్తుంది. ఈ నష్టాలను తగ్గించకుండా విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయడం మాత్రమే దీర్ఘకాలిక పరిష్కారం కాదు.

వినియోగదారులపై పెరుగుతున్న భారం

తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంఘం ( టీజీఈఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎసీ) 2026 అక్టోబరులో జారీ చేసిన ట్రూ-అప్ ఉత్తర్వుల ప్రకారం, గత సంవత్సరాల విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాట్లలో రూ.7,635.22 కోట్లను ఆమోదించింది. ఇందులో రూ.2,214.99 కోట్ల వ్యవసాయ విద్యుత్ వ్యయాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉండగా, మిగిలిన రూ.5,420.23 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని దశలవారీగా విద్యుత్ బిల్లుల ద్వారా వసూలు చేయడం వల్ల గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై అదనపు భారం పడుతుంది.  ఇది విద్యుత్ రంగంలో ఆర్థిక అసమతుల్యత చివరకు వినియోగదారులపై ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేస్తుంది. అయితే ట్రూ-అప్ అనేది గతంలో జరిగిన వాస్తవ వ్యయాలను నియంత్రణ సంస్థ పరిశీలించి సర్దుబాటు చేసే ప్రక్రియ. కాబట్టి దాని అవసరాన్ని మాత్రమే కాకుండా ఆమోదించిన ఖర్చులు, ప్రభుత్వ సబ్సిడీ వాటా, వినియోగదారులపై పడే భారం పారదర్శకంగా సమీక్షించాలి. 

రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం, ముందున్న సవాళ్లు

డిస్కంల ఆర్థిక అస్థిరత పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి, గృహ వినియోగం, రాష్ట్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపుతుంది. విద్యుత్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెరిగితే చిన్న పరిశ్రమలు, వ్యాపార సంస్థల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. వడ్డీ, పాత బకాయిల చెల్లింపులకే అధిక నిధులు వెచ్చించాల్సి వస్తే  కొత్త విద్యుత్  మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు తగ్గుతాయి. ప్రభుత్వం డిస్కంల నష్టాలను భరించాల్సి వస్తే విద్య,  వైద్యం, రహదారులు, గ్రామీణాభివృద్ధి వంటి ఇతర రంగాలకు అందుబాటులో ఉండే బడ్జెట్ వనరులపై ఒత్తిడి ఏర్పడుతుంది. 

ఈ సమస్యకు పరిష్కారం సంక్షేమ పథకాలను రద్దు చేయడం కాదు. వాటిని ఆర్థికంగా స్థిరమైన పద్ధతిలో అమలు చేయడం. ప్రభుత్వ శాఖల బకాయిలను చెల్లించడం, సబ్సిడీ నిధులను ముందుగానే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటాయించి నెలవారీగా విడుదల చేయడం, నష్టాలను తగ్గించేందుకు ఆధునిక మీటరింగ్, డిజిటల్ బిల్లింగ్, ఫీడర్ స్థాయి ఆడిటింగ్ చేపట్టడం అత్యవసరం. అలాగే  దీర్ఘకాలిక  విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించి, తక్కువ వ్యయంతో విద్యుత్ లభించే అవకాశాలను పెంచాలి.  

డిస్కంల ఆదాయం, వ్యయం, అప్పులు, సబ్సిడీ బకాయిలపై స్వతంత్ర ఆడిట్, పారదర్శక నివేదికలు తప్పనిసరి చేయాలి.  2014–2023 కాలంలో పెరిగిన అప్పులు, పేరుకుపోయిన నష్టాలు, ప్రభుత్వ శాఖల బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి.  విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరసమైన ధరకు, సమర్థవంతంగా అందిస్తూ, పంపిణీ సంస్థలను అప్పులపై ఆధారపడకుండా ఆర్థికంగా బలోపేతం చేయాలి.  ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత మధ్య సమతుల్యత సాధించినప్పుడే తెలంగాణ విద్యుత్ రంగం దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పొందగలదు.

మూడో డిస్కం ఏర్పాటు పరిష్కారం కాదు

2025 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనే మూడో డిస్కం ఏర్పాటు ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ సంస్థకు బదిలీ చేయనున్న రుణాలు,  జనరేటర్ బకాయిలు కలిపి రూ.35,982 కోట్లుగా ఉండగా, బదిలీ అయ్యే ఆస్తుల విలువ రూ.4,929 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం కొత్త సంస్థ ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను సూచిస్తుంది. వ్యవసాయ విద్యుత్ పంపిణీని ప్రత్యేక సంస్థ ద్వారా నిర్వహించడం పరిపాలనాపరంగా ఉపయోగకరమై ఉండవచ్చు. కానీ అప్పులు, బకాయిలు, ఆదాయ లోటులకు స్పష్టమైన పరిష్కారం చూపకుండా కేవలం సంస్థాగత విభజన చేపడితే సమస్య ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ అవుతుంది తప్ప మొత్తం విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు.

- చిట్టెడ్డి కృష్ణారెడ్డి, 

అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీయూ
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.