వెలుగు స్పెషల్: ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమంతో.. వెలుగులోకి ప్రభుత్వ బడుల దుస్థితి

వెలుగు స్పెషల్: ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమంతో.. వెలుగులోకి  ప్రభుత్వ బడుల దుస్థితి

కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితులను దేశ ప్రజల ముందుపెట్టింది. 2009లో అమలులోకి వచ్చిన బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ( రైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఈ) నిర్దేశించిన కనీస ప్రమాణాలను కూడా దేశంలోని అనేక పాఠశాలలు ఇప్పటికీ అందుకోలేకపోవడం సిగ్గుచేటు.  ప్రభుత్వ గణాంకాలు, ముఖ్యంగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ నివేదిక– 2026 ప్రకారం దేశంలోని అనేక పాఠశాలల్లో ఇప్పటికీ వర్షం కురిసినప్పుడు కారే పైకప్పులు, అపరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు, పనిచేయని చేతి పంపులు, పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన ఆటస్థలాల కొరత వంటి సమస్యలు కొనసాగుతున్నాయి.  కాక్రోచ్  జనతా పార్టీ  ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాలల ఆడిట్ ద్వారా ఈ సమస్యలకు కారణమైన వ్యవస్థాగత లోపాలు బయటపడ్డాయి. 

మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి

ఇది కేవలం నిధుల ఖర్చుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. కమీషన్ల కోసం నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లకు భారీగా డబ్బు ముట్టచెప్పే పరిస్థితి కూడా ఉంది.  పాఠశాలల  నిర్వహణ, మరమ్మతుల కోసం సమర్థవంతమైన వ్యవస్థలు లేకపోవడం మరో ప్రధాన సమస్య. జార్ఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్నపాటి పాఠశాల నిర్వహణ పనుల కోసం సాధారణంగా అందుబాటులో ఉండే నిధులను కూడా గత రెండేళ్లుగా నిలిపివేశారు. దీంతో చీపుర్లు, తుడిచే సామగ్రి కొనుగోలు వంటి చిన్న అవసరాలను తీర్చడం కూడా కష్టంగా మారింది.  ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు మెరుగుపడాలంటే మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపడాలి. చురుకైన బోధన లేకపోవడం వల్లే అనేకమంది పిల్లలు పాఠశాలల్లో చాలా తక్కువగా విద్యను నేర్చుకుంటున్నారు. దీంతో  కెరీర్‌‌‌‌లో  వెనుకపడి చిన్నపాటి ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారు.

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు

ఉపాధ్యాయులు తమపై బోధనేతర  పనుల భారం పెరుగుతోందని ఫిర్యాదు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం.. జనాభా లెక్కలు, విపత్తు సహాయక చర్యలు, ఎన్నికల సంబంధిత విధులు మినహా ఇతర విద్యేతర పనుల కోసం ఉపాధ్యాయులను నియమించకూడదు. అయితే ‘విద్యా సంబంధిత పనులు’ అనే పదానికి విస్తృతమైన అర్థం కల్పిస్తూ ఉపాధ్యాయులకు అనేక బోధనేతర పనులు అప్పగిస్తున్నారు.  ఉపాధ్యాయుల పనిసమయ పట్టికలో బోధనేతర పనులకు కూడా కొంత సమయం కేటాయిస్తున్నారు.  

విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు వారానికి కనీసం 45 గంటలు పనిచేయాలి.  ప్రాథమిక పాఠశాలల్లో రోజుకు కనీసం నాలుగు గంటల తరగతి బోధన ఉండాలనే నిబంధన కూడా ఉంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు తరగతి గది బోధనకు అదనంగా వారానికి 21 గంటల వరకు ఇతర పనుల కోసం సమయం ఉంటుంది. తరగతుల కోసం రోజుకు ఒక గంట సన్నద్ధత సమయాన్ని తీసివేసినా, వారానికి మరో 15 గంటలు ఇతర విద్యా సంబంధిత పనుల కోసం మిగులుతాయి.

విద్యాబోధనకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి

వాస్తవానికి పాఠశాల పని వేళల్లోనే అనేకమంది ఉపాధ్యాయులు బోధనేతర పనులను పూర్తి చేయడానికి అలవాటుపడుతున్నారు. కొన్నిసార్లు పాఠశాల సమయాల్లోనే బ్లాక్ రిసోర్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలవడం, వెంటనే నివేదికలు పంపాలని వాట్సాప్ సందేశాలు రావడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరికొన్నిసార్లు ఎక్కువ సమయం పని చేయాల్సిన పరిస్థితి రాకుండా ఉపాధ్యాయులే తరగతి సమయాల్లో బోధనేతర పనులను పూర్తి చేస్తున్నారు.  దీనివల్ల విద్యార్థుల బోధనే నష్టపోతోంది. తరగతి గది బోధనా సమయాన్ని స్పష్టంగా నిర్వచించి, దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకుసాగాలి.

- మాసంపల్లి అరుణ్ కుమార్
రాష్ట్ర అధ్యక్షుడు,విద్యార్థి జన సమితి
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.