కుట్రదారులెవరో తేల్చండి..నాపై వచ్చిన ఆరోపణలపై  సమగ్ర విచారణ జరపండి :  అగ్రికల్చర్ వీసీ జానయ్య 

కుట్రదారులెవరో తేల్చండి..నాపై వచ్చిన ఆరోపణలపై  సమగ్ర విచారణ జరపండి :  అగ్రికల్చర్ వీసీ జానయ్య 
  • డీజీపీకి అగ్రికల్చర్​ వీసీ జానయ్య లేఖ

హైదరాబాద్, వెలుగు: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలేంటో నిగ్గుతేల్చాలని అగ్రికల్చర్​వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య డీజీపీ సీవీ ఆనంద్​కి లేఖ రాశారు. వర్సిటీలో వ్యవస్థాగత ప్రక్షాళన, సంస్కరణలను ఓర్వలేని కొన్ని శక్తులు.. బదిలీలను అడ్డంపెట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చే  కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.  ‘నిజామాబాద్ జిల్లాలోని ‘కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో 12 ఏండ్లుగా పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలిని నిబంధనల ప్రకారం బదిలీ చేశాం.

అందుకే ఆమె నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో ఆ మహిళా అధ్యాపకురాలు చేసిన వ్యాఖ్యలన్నీ వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యే నాకు వేధింపులు ఎదురయ్యాయి. బదిలీ అనంతరం ఆరోపణలు చేయడం వెనుక ఇతరుల ప్రమేయం ఉంది’ అని అనుమానం వ్యక్తం చేశారు. 35 ఏండ్ల తన వృత్తి జీవితంలో మహిళా సహోద్యోగుల పట్ల ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదని జానయ్య పేర్కొన్నారు.

తన వ్యక్తిగత ప్రతిష్టను, వీసీ పదవికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మహిళా అధ్యాపకురాలితో తనకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు, ఫోన్ కాల్ వివరాలు సహా అందుబాటులో ఉన్న డిజిటల్ ఆధారాలను పరిశీలించాలన్నారు. ‘ఆరోపణల వెనుక ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి పాత్ర ఏమిటో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డీజీపీకి తన లేఖలో విజ్ఞప్తి చేశారు