- ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి
- ఒక దశలో 89.62 డాలర్లకు పతనం
- ముందు సెషన్లోనూ 6% డౌన్
- ఇరాన్ యుద్ధానికి తెరపడొచ్చనే ఆశలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు చేరింది. గత ఆగస్టు తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌లో ఒక దశలో బ్రెంట్ ధర 89.62 డాలర్లకు తగ్గింది. అంతకుముందు సెషన్లోనూ ధరలు సుమారు 6 శాతం మేర పతనమయ్యాయి. ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశాలపై అంతర్జాతీయంగా ఆశలు పెరగడం చమురు ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే ముడిచమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో చమురు సరఫరా మెరుగుపడుతుందనే అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. యుద్ధం కారణంగా గతంలో సరఫరా నిలిచిపోవచ్చనే ఆందోళనతో చమురు ధరలు భారీగా పెరిగాయి.
అయితే ఇప్పుడు శాంతి చర్చలు, ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలు వెలువడటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వరుస సెషన్లలో చమురు ధరలు దిగివస్తున్నాయి. ముడిచమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు కొంత ఊరట లభించవచ్చు. విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి, దిగుమతి బిల్లు తగ్గే అవకాశాలుంటాయి. ధరల తదుపరి కదలికలు పశ్చిమాసియా పరిణామాలు, సరఫరా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇరాన్‌పై సైనిక చర్యల అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదని ట్రంప్ సంకేతాలిచ్చారు. హార్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణా క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ, అంతరాయాల ముప్పు ఇంకా తొలగిపోలేదు. సౌదీ అరేబియా కీలక చమురు పైప్‌లైన్‌పై దాడి జరగడం ఆందోళన కలిగించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
