- కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై యుద్ధం చేశారంటూ..
- సొంత పార్టీ ఎంపీ ఆగ్రహం
- కాంగ్రెస్ ఆమోదం లేకుండా దాడులు చేశారని ఆరోపణ
వాషింగ్టన్: అమెరికా డిఫెన్ మినిస్టర్ (పెంటగాన్ చీఫ్) పీట్ హెగ్‌సెత్‌పై రిపబ్లికన్ పార్టీకే చెందిన ఎంపీ ఒకరు సోమవారం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కెంటకీకి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాస్సీ మొత్తం 8 అంశాలతో కూడిన అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా ఇరాన్‌పై యుద్ధానికి దిగారని, రక్షణ మంత్రిగా తన అధికారాలను దుర్వినియోగం చేశారని హెగ్‌సెత్‌పై ఆరోపణలు చేశారు.
1973 నాటి ‘వార్ పవర్స్ రిజల్యూషన్’చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు యెమెన్, వెనిజువెలా సైనిక చర్యల్లో పౌరుల మరణాలకు హెగ్‌సెత్ బాధ్యుడని మాస్సీ పేర్కొన్నారు. పెంటగాన్ వర్గాలు ఆయన ఆరోపణలను కొట్టిపారేశాయి. ప్రస్తుతం రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో బుధవారం ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. డెమోక్రాట్లతో పాటు కొందరు అసంతృప్త రిపబ్లికన్ సభ్యులు కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
జనవరిలో స్పీకర్ పదవి చేపట్టనున్న డెమోక్రటిక్ సభా పక్ష నేత హకీమ్ జెఫ్రీస్ ఈ తీర్మానానికి పూర్తి మద్దతు ప్రకటించారు. హెగ్‌సెత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు రిపబ్లికన్ ఎంపీ డాన్ బేకన్ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు నిధులు నిలిపివేయడం, సుమారు 80 మంది సీనియర్ సైనికాధికారుల పదోన్నతులను అడ్డుకున్నందుకు హెగ్‌సెత్‌ను అభిశంసించాలని డిమాండ్ చేశారు.
