షేక్ హసీనా తిరిగొస్తే ఆమెకు మరణ శిక్షనే.. మరో మార్గం లేదు: బంగ్లాదేశ్

షేక్ హసీనా తిరిగొస్తే ఆమెకు మరణ శిక్షనే.. మరో మార్గం లేదు: బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే గడువు ముగిసిపోయిందని, ఆమె బంగ్లాదేశ్కు తిరిగి వస్తే మరణశిక్షను ఎదుర్కోవలసి వస్తుందని బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ అమీనుల్ ఇస్లాం హెచ్చరించారు. పదవీచ్యుతురాలైన షేక్ హసీనా డిసెంబర్‌లో తిరిగి బంగ్లాదేశ్ వస్తానని శపథం చేయగా, ఆమెను అప్పగించాల్సిందేనని ఢాకా పట్టుబడుతోంది. 

మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్షను ఖరారు చేసిన బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ అమీనుల్ ఇస్లాం, ఆమె స్వదేశానికి తిరిగి వస్తే ఉరితీస్తామని మంగళవారం (నవంబర్ 10) తెలిపారు. 2024లో జరిగిన విద్యార్థుల ఆందోళనలపై ఘోరమైన అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా షేక్ హసీనా చేసిన నేరాలకు గాను, నవంబర్ 2025లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణ శిక్ష విధించింది. హసీనా ఈ ఆరోపణలను ఖండించారు. తీర్పును తిరస్కరించారు. తన గైర్హాజరీలో జరిగిన విచారణ నిష్పాక్షికతను ఆమె ప్రశ్నించారు. తనకు శిక్ష పడి మరణ శిక్ష విధించబడినప్పటికీ, డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ఆమె శపథం చేసిన సంగతి తెలిసిందే.

►ALSO READ | బుల్డోజర్తో గవర్నమెంట్ ఆఫీస్ను కూల్చేశాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ !

2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచివచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన ఆమె పాలనకు విద్యార్థి ఉద్యమం ముగింపు పలికింది. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ఎదుట లొంగిపోవాలని హసీనా భావిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. 

అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణ తేదీని వెల్లడిస్తారని ఆమె సహాయకులు తెలిపారు. అయితే కొత్త పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు కోసం చేసిన విజ్ఞప్తిపై బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. ఈ క్రమంలో హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే అంశం ఆసక్తికరంగా మారింది.