హైదరాబాద్: మాదాపూర్‌లో తమ్మిడికుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి రేపు (నవంబర్ 11, 2026) సాయంత్రం ప్రారంభించనున్నారు. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవానికి హైడ్రా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తమ్మిడికుంట ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
ఇదే తమ్ముడికుంట చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారని నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ను గతంలో హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే. రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధిలో గుడిసెలు కోల్పోయిన 34 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను సీఎం అందజేయనున్నారు.
— తమ్మిడికుంట ప్రారంభోత్సవ ఏర్పాట్లను.. — క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ — ఈ నెల 11న సీఎం చేతుల మీదుగా చెరువు ప్రారంభం — వేదిక, పార్కింగ్, సీటింగ్, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల పరిశీలన — హైడ్రా కమిషనర్‌తో పాటు సైబరాబాద్ సీపీ, డీసీపీ, ఇతర ఉన్నతాధికారుల పర్యటన ✳️ మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా హైడ్రా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చెరువును ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రారంభోత్సవ వేదిక ఏర్పాటు, ప్రముఖులు, ప్రజల కోసం కేటాయించిన సీటింగ్ ప్రాంతాలు, వాహనాల పార్కింగ్, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ గారు, డీసీపీ రితిరాజ్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. చెరువు అభివృద్ధి చేసిన తీరుతో పాటు సమకూర్చిన సౌకర్యాలను చెరువు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన విమోస్ టెక్నోక్రాట్స్ అధినేత యూనస్ పర్వేజ్ గారు అధికారులకు వివరించారు. @cyberabadpolice @CYBTRAFFIC #HYDRAA #Thammidikunta #LakeRestoration #LakeInauguration #CMRevanthReddy
— HYDRAA (@Comm_HYDRAA) November 9, 2026
ముఖ్యమంత్రి చేతుల మీదుగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేస్తారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి ముందు దుర్గంధభరితంగా ఉండేది. నిర్మాణ వ్యర్థాలు, చెత్త, బయోమెడికల్ వ్యర్థాల డంపింగ్ యార్డుగా మారిన చెరువును హైడ్రా పునరుద్ధరణతో రూపురేఖలు మార్చేసింది. చెరువులో 30 వేల ట్రక్కులకు పైగా పూడిక తొలగించింది. దుర్గంధభరిత వాతావరణం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తమ్మిడికుంట చెరువు మారడం విశేషం.
* చెరువు చుట్టూ 1.6 కిలోమీటర్ల మేర వాకింగ్ పాత్ ఏర్పాటు
* సందర్శకుల కోసం అత్యాధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు
* పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటస్థలం ఏర్పాటు
* చెరువు పరిసరాల్లో వేలాది మొక్కలతో పచ్చదనం పెంపు
* సందర్శకుల కోసం ప్రత్యేకంగా కూర్చునే వేదిక ఏర్పాటు
* వేదిక మధ్యలో 60 ఏళ్ల బోన్సాయ్ మొక్క ప్రత్యేక ఆకర్షణ
* వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు అనుకూలంగా చెరువు అభివృద్ధి
