డ్రగ్స్ దందాలో  దొరికిన్రా..సచ్చిన్రే..ఎంతటి పలుకుబడి ఉన్నా వదలి పెట్టబోం

డ్రగ్స్ దందాలో  దొరికిన్రా..సచ్చిన్రే..ఎంతటి పలుకుబడి ఉన్నా వదలి పెట్టబోం
  • ఈగల్ ఫోర్స్‌‌‌‌తో డ్రగ్స్ వ్యాపారుల పనిపడ్తం
  • బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లో కూర్చునే సంపాదన ఊడుస్తుండ్రు
  • కోట్లు వద్దు.. రిగ్గింగ్ వద్దు.. నిజాయితీ చాలు
  • బాధితులకు నీళ్లిచ్చి, ఓపికగా మాట్లాడండి
  • ట్రైనీ డీఎస్పీలతో ముఖాముఖిలో సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో డ్రగ్స్ సంస్కృతిని ఏమాత్రం సహించబోమని, ఎంతటి పలుకుబడి ఉన్నవాళ్లయినా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘డ్రగ్స్ దందాలో దొరికిన్రా.. సచ్చిన్రే’ అనేలా పోలీసుల తీరు ఉండాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ ద్వారా డ్రగ్స్ వ్యాపారుల పనిపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పోలీసుల నుంచి కోట్ల రూపాయలు గానీ, ఎన్నికల్లో రిగ్గింగ్ గానీ ఆశించడం లేదని, నిజాయితీగా, బాధ్యతగా విధులు నిర్వహిస్తే చాలని అన్నారు. ఇటీవల పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకున్న గ్రూప్–1 ట్రైనీ డీఎస్పీలతో ఎంసీఆర్ హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీలో సీఎం ముఖాముఖి నిర్వహించారు.

గోడలు దూకే దొంగలు పోయిన్రు

టెక్నాలజీతో నేరాల ముఖచిత్రమే మారిపోయిందని సీఎం అన్నారు. ‘ఒకప్పుడు దొంగతనం చేయాలంటే గోడలు దూకి, ఒంటికి మసి, నూనె పూసుకుని, తలుపులు, బీరువాలు బద్దలు కొట్టి, తలలు పగలగొట్టి ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లేటోళ్లు. ఇప్పుడు దొంగలు మీ ఇంటికి రావాల్సిన పనే లేదు. ఏ దేశంలోనో, ఏ రాష్ట్రంలోనో తన బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌లో కూర్చుని, చిన్న మొబైల్ ఫోన్, నెట్ కనెక్షన్‌‌‌‌‌‌‌‌తో మీ ఫోన్‌‌‌‌‌‌‌‌లోకి చొరబడి జీవితకాల సంపాదనంతా ఊడ్చేస్తున్నడు’ అని సైబర్ నేరాల తీవ్రతను వివరించారు.

గతంలో శాంతిభద్రతల కోసం ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్, సీబీసీఐడీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకున్నామని, నేటి తరం అధికారులు కూడా కాలానికి తగ్గట్టు కొత్త నేర పరిశోధన పద్ధతులు నేర్చుకోవాలని సూచించారు. ఒకప్పుడు హత్యలు, అత్యాచారాలతో పాటు ఆహార ధాన్యాలను దాచి కృత్రిమ కొరత సృష్టించడం తీవ్ర నేరాలుగా ఉండేవని, కరువుతో లక్షలాది మంది చనిపోతుంటే బ్లాక్ మార్కెటర్లు ధాన్యాన్ని దాచిపెట్టేవారని గుర్తుచేశారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల తర్వాత దేశం ఆహార మిగులు స్థాయికి చేరిందని, ఇప్పుడు ఆహార కొరత పోయి కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.

కోట్లు వద్దు.. నిజాయితీ చాలు

‘ఈ ప్రభుత్వం మీ నుంచి కోట్ల రూపాయలు ఆశించడం లేదు. రేపు ఎన్నికలొస్తే బూత్‌‌‌‌‌‌‌‌లలో రిగ్గింగ్ చేసి ఓట్లు వేయించాలని కోరడం లేదు. మీ నుంచి కోరుకునేది ఒక్కటే.. నిజాయితీగా, బాధ్యతగా విధులు నిర్వహించండి’ అని సీఎం దిశానిర్దేశం చేశారు.

బాధితులకు మంచినీళ్లివ్వండి

పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. ‘ఎవరికైనా తన సమస్య భూమ్మీద ఎవరికీ రానంత పెద్దదిగా కనిపిస్తుంది. అభిమాన హీరో సినిమా టికెట్ దొరకకపోవడం పక్కవాడికి పిచ్చిగా అనిపించొచ్చు, కానీ ఆ వ్యక్తికి అదే పెద్ద బాధ. బాధితుడు స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వస్తే అధికార దర్పం చూపకుండా కుర్చీలో కూర్చోబెట్టి, మంచినీళ్లిచ్చి, పది నిమిషాలు ఓపికగా మాట్లాడితే సగం బాధ తీరిపోతుంది’ అని అన్నారు. చిరాకుపడి పంపిస్తే బయటకు వెళ్లి పోలీసుల్లో మానవత్వం లేదని ప్రచారం చేయడమే కాకుండా పదిసార్లు వచ్చి ఇబ్బంది పెడతారని, మొదట్లోనే ఐదు నిమిషాలు కేటాయించి సమస్యను విడమర్చి చెబితే నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు.

గ్రూప్–1పై కుట్రలు

గ్రూప్–1 నియామకాలను అడ్డుకునేందుకు గతంలో కొందరు కావాలని కుట్రలు చేశారని, తాము చేయలేని పనిని ప్రజా ప్రభుత్వం చేసి చూపిస్తుంటే ఓర్వలేక కోర్టుల్లో పిటిషన్లు వేసి అభ్యర్థులను ఆందోళనకు గురిచేశారని సీఎం మండిపడ్డారు. కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించి, చివరికి సుప్రీంకోర్టు ద్వారా నియామకాలకు ఆమోదం సాధించామన్నారు. ఈ ఉద్యోగం ఎవరికీ ఆషామాషీగానో, వారసత్వంగానో రాలేదని, సొంత ప్రతిభ, కష్టం, జ్ఞానం, నిబద్ధతతోనే సాధించుకున్నారని, వచ్చిన నేపథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. రాబోయే 30 ఏండ్లు తెలంగాణ ఏ దిశగా నడవాలనేది యువ అధికారుల చేతుల్లోనే ఉందన్నారు. పోలీస్ వ్యవస్థలో ఎస్పీ, డీఐజీ, ఐజీ, అదనపు డీజీ, డీజీపీ దాకా అంతా పర్యవేక్షక అధికారులేనని అన్నారు.

పంజాబ్ పరిస్థితి రావొద్దు

ఒకప్పుడు ఎక్సైజ్ పోలీసులు దొంగసారా, గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తే సరిపోయేదని, ఇప్పుడు కొకైన్, హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్, గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని సీఎం అన్నారు. డ్రగ్స్ వల్ల యుద్ధవీరుల నేల పంజాబ్ నిర్వీర్యమైపోయిందని, అక్కడ మహిళలు కూలి పనులు చేసి భర్తలకు, కొడుకులకు డ్రగ్స్ కొనిపెట్టే దుస్థితి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి రానివ్వబోమన్నారు.