సమ్మక్క సాగర్ డీపీఆర్ వాపస్‌‌‌‌పై సీఎం సీరియస్..CWC అడిగిన వివరాలు పూర్తిగా ఇవ్వాలె

సమ్మక్క సాగర్ డీపీఆర్ వాపస్‌‌‌‌పై సీఎం సీరియస్..CWC అడిగిన వివరాలు పూర్తిగా ఇవ్వాలె
  • సీడబ్ల్యూసీ అడిగిన వివరాలు సమగ్రంగా ఇవ్వాలె
  • చత్తీస్‌‌‌‌గఢ్ నుంచి ఎన్వోసీ త్వరగా తేవాలె
  • కాళేశ్వరం అదనపు టీఎంసీపై తొందరొద్దు
  • ఇప్పుడు 2 టీఎంసీలనే ఎత్తిపోయలేని పరిస్థితి
  • కృష్ణా వాటాపై సుప్రీంలో గట్టిగా వాదించాలె
  • మంత్రి ఉత్తమ్‌‌‌‌తో కలిసి ఇరిగేషన్​ అధికారులతో  
  • సీఎం రేవంత్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్‌‌‌‌ను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వెనక్కి పంపడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీపీఆర్ ఎందుకు వెనక్కి వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం, సీడబ్ల్యూసీ అడిగిన వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా స్టడీ చేసి సమర్పించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టుపై చత్తీస్‌‌‌‌గఢ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఆలస్యం కావడంపైనా ఆరా తీశారు. వీలైనంత త్వరగా ఆ రాష్ట్రం నుంచి ఎన్వోసీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీలోని బోధి పెవిలియన్‌‌‌‌లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అంతర్రాష్ట్ర జలాలు, డిండి, అచ్చంపేట లిఫ్టులు, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపై సీఎం రివ్యూ చేశారు.

తొందరపాటు నిర్ణయాలు వద్దు

కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడున్న రెండు టీఎంసీలనే ఎత్తిపోయలేని పరిస్థితి ఉన్నందున అదనపు టీఎంసీ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించాకే భూసేకరణ చేపట్టాలని, సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు పొంది, డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఫైనల్ డీపీఆర్‌‌‌‌లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.

కృష్ణాలో న్యాయమైన వాటా రావాల్సిందే

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం ఆదేశించారు. ఏపీతో వివాదం ఉన్న అన్ని అంశాలపై అవసరమైన ఆధారాలు సమర్పించాలన్నారు. నీటి వాటాలపై ఈ నెల 18 తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతోనూ చర్చించారు. 

 డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలని, ఇప్పటికే నిర్ణయించినట్లు ఏదుల నుంచే ఈ రెండు పథకాలకు నీళ్లు ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఆటంకాలు లేకుండా చూడాలని, ఎక్కడ టన్నెల్, ఎక్కడ కాలువ అవసరమో గుర్తించి డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలుపెట్టాలని సూచించారు. రివ్యూలో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.