రైతులు, బ్యాంకుల బంధం దెబ్బతినొద్దు..రుణాలు వెంటనే రీషెడ్యూల్ చేయాలి: భట్టి

రైతులు, బ్యాంకుల  బంధం దెబ్బతినొద్దు..రుణాలు వెంటనే రీషెడ్యూల్ చేయాలి: భట్టి
  •     యాసంగికి కొత్త రుణాలు సకాలంలో ఇవ్వాలి
  •     మహిళా సంఘాలకు రూ.2 లక్షల ఎక్స్ ట్రా..
  •     వానాకాలం రుణాలు 17 శాతమేనా?: తుమ్మల
  •     ఎల్‌‌‌‌నినోతో 10–15 లక్షల బోర్లు ఎండిపోయినయ్
  •     ప్రత్యేక ఎస్ఎల్‌‌‌‌బీసీ భేటీలో డిప్యూటీ సీఎం, మంత్రి

 

హైదరాబాద్, వెలుగు: కరువు పరిస్థితుల్లో రైతులకు, బ్యాంకులకు మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంట రుణాలను వెంటనే రీషెడ్యూల్, పునర్వ్యవస్థీకరించడంతో పాటు యాసంగికి కొత్త రుణాలు సకాలంలో ఇవ్వాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన స్టేట్​లెవెల్​బ్యాంకర్ల కమిటీ (ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ) ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న, సన్నకారు, కౌలు రైతులు, వ్యవసాయ అనుబంధ కుటుంబాలకు ప్రాధాన్యమిస్తూ తక్కువ నీటితో సాగయ్యే పంటలు, పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యం, నిల్వ, ప్రాసెసింగ్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్‌‌‌‌‌‌‌‌పీవోలు) రుణ సహకారం అందించాలన్నారు.

కరువు వేళ కనీసం 10–15 శాతం రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలని, గ్రామాల్లో నగదు చలామణి పెంచేందుకు స్వయం సహాయక సంఘాలకు అదనంగా మరో రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని సూచించారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ఈ నెల 19 నాటికి ‘రాజీవ్ యువ వికాసం’ను పట్టాలెక్కించేందుకు బ్యాంకులు చొరవ చూపాలన్నారు. అర్హులైన విద్యార్థులకు విద్యా రుణాలు, సామాన్యులకు వ్యక్తిగత గృహ రుణాలు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ, మౌలిక సదుపాయాల రంగాలకు నిర్దేశిత రుణాలు అందించాలని ఆదేశించారు. అక్టోబర్ 16న విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 20,818 మెగావాట్లకు చేరిందని, భూగర్భ జలాలు పడిపోవడంతో రైతుల చెల్లింపు సామర్థ్యం తగ్గిందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకర్లు రైతులకు అండగా నిలవాలని కోరారు.

వానకాలం లోన్లు 17 శాతమేనా: తుమ్మల

సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌నినో వల్ల కృష్ణా, గోదావరి నదులకు వరదలు రాక జలాశయాల్లో నీరు అడుగంటిందన్నారు. భూగర్భ జలాలు రీఛార్జ్ కాక 10–15 లక్షల బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. ప్రభుత్వం గత రెండున్నరేండ్లలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ, రూ.36 వేల కోట్ల రైతు భరోసాతో కలిపి వ్యవసాయంపై రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బ్యాంకులు కూడా అదే స్ఫూర్తితో రబీకి నిర్దేశించిన రూ.38,268 కోట్ల పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు.

2026 సెప్టెంబర్ నాటికి రూ.96,943 కోట్ల వార్షిక వ్యవసాయ రుణ లక్ష్యంలో 53 శాతమే సాధించడంపై, వానకాలం పంట రుణాల పంపిణీ 17 శాతానికే పరిమితం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలు, డ్రిప్, స్ప్రింక్లర్ సాగుకు రుణాలివ్వాలని, ప్రస్తుతం 3.5 లక్షల ఎకరాల్లో ఉన్న ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్ సాగును విస్తరించేందుకు సహకరించాలన్నారు. పాడి, పౌల్ట్రీ, తేనెటీగల పెంపకం, మహిళా సంఘాలు, ఎఫ్‌‌‌‌‌‌‌‌పీవోలకు ప్రాధాన్యమివ్వాలని, రైతులకు ఆదాయం తిరిగి వచ్చే వరకు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రుణాలను రీస్ట్రక్చరింగ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు రాహుల్ బొజ్జా, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ బ్యాంకర్లు  తదితరులు పాల్గొన్నారు.