హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రోజుకు కనీసం 16 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ లో సింగరేణి, జెన్‌కో మధ్య ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఇందులో బొగ్గు రవాణాపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ జెన్‌కోకు బొగ్గు సప్లై మరింత పెంచాలని నిర్ణయించారు. జెన్‌కో థర్మల్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్జ్యోతి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లను ఆదేశించారు. గత మూడు, నాలుగేళ్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది తెలంగాణ జెన్‌కోకు ఎక్కువ బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలిపారు.
